అసౌకర్యాల్లో ఆదర్శం
పుట్టపర్తి అర్బన్: ఉడకని పప్పు, నీళ్ల చారు, ముద్దగా మారిన అన్నం.. పుట్టపర్తి మండలం జగరాజుపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థినులకు రోజూ వడ్డించే భోజనం ఇది. కూటమి ప్రభుత్వం వసతి గృహాల్లోని విద్యార్థులకు రోజుకో వంటకం అంటూ ప్రచారం హోరెత్తిస్తున్నా...ఇక్కడ మాత్రం మెనూ అమలు కావడం లేదు. కనీస సౌకర్యాలూ కరువు కావడంతో విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు.
ప్రభుత్వం మారడంతో సమస్యలు..
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందించడానికి మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించేది. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు దీరగానే మోడల్‌స్కూళ్ల నిర్వహణ దారి తప్పింది. మెనూకు పూర్తిగా మంగళం పాడారు. ఉడికీ ఉడకనీ అన్నంత...నీళ్ల చారతోనే సరిపెడుతున్నారు. దీనికి తోడు ఆదర్శ పాఠశాల వసతి గృహం గ్రామానికి దూరంగా పొలాల్లో ఉండటం... వార్డెన్ స్థానికంగా ఉండకపోవడంతో విద్యార్థినులు బిక్కుబిక్కుమంటూ గడువుతున్నారు.
ఫిర్యాదు చేసినా....
జగరాజుపల్లి ఆదర్శ పాఠశాల వసతి గృహం సమస్యలపై ఇటీవల ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కలెక్టర్ టీఎస్ చేతన్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. పైగా సమస్య పరిష్కరించినట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చిందని ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు పవన్ వాపోయారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్య ధోరణిపై గురువారం పుట్టపర్తి విమానాశ్రయానికి విచ్చేస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
కనీస సౌకర్యాలు కరువు..
ఆదర్శ పాఠశాల వసతి గృహం మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో ఒకరు లోపలుంటే బయట మరొకరు కాపలాగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక సాయంత్రం స్నాక్స్ ఇవ్వకుండా వంట మనుషులు, వార్డెన్ తీసుకెళ్తున్నారని, దీనిపై చాలాసార్లు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థినులు చెబుతున్నారు. వందలమంది విద్యార్థినులున్న వసతి గృహంలో కేవలం 5, 6 కిలోల చికెన్ తెచ్చి వండి పెడుతున్నారని, అందులోనే వంట మనుషులే తింటున్నారని చెబుతున్నారు. 5 నిమిషాలు లేటుగా వెళ్తే భోజనం పెట్టడం లేదని వాపోతున్నారు. వసతి గృహ భవనం నిర్వహణ సరిగా లేక శిథిలావస్థకు చేరిందని, డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేక మురుగు అక్కడే నిలిచి దుర్వాసన వెదజల్లుతోందని విద్యార్థులు చెబుతున్నారు. అపరిశుభ్ర వాతావరణం వల్ల తరచూ రోగాల బారిన పడుతున్నామని, తల్లిదండ్రులకు విషయం చెబితే సిబ్బంది బెదిరిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు.
సమస్యల వలయంలో
జగరాజుపల్లి ఆదర్శపాఠశాల
తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా
స్పందన శూన్యం
Comments
Please login to add a commentAdd a comment