రేపు ముక్కోటి ఏకాదశి
కదిరి టౌన్: ముక్కోటి ఏకాదశికి జిల్లా ముస్తాబవుతోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరనున్న నేపథ్యంలో ఆయా ఆలయాల నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆ రోజు స్వామి వారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఆ రోజు ఆలయాలు భక్తులతో పోటెత్తుతాయి.
ఖాద్రీ ఆలయంలో ఏర్పాట్లు..
ముక్కోటి ఏకాదశికి కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటల నుంచి (ఉత్తర రాజగోపురం ద్వారం) భక్తులకు స్వామివారు దర్శనమిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజున స్వామి దర్శనం సర్వపాపహరణం అని భక్తులు భావిస్తారు. ఈ క్రమంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తారు. భక్తుల రద్దీని అంచనా వేసిన ఆలయ అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయ ఆవరణనూ రకరకాల పూలతో ప్రత్యేక అలంకరిస్తున్నారు.
ముస్తాబవుతున్న ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం
Comments
Please login to add a commentAdd a comment