గొర్రెల మందపైకి దూసుకెళ్లిన ట్యాంకర్
బత్తలపల్లి: స్థానిక జాతీయ రహదారిపై ఓ ట్యాంకర్ భీభత్సాన్ని సృష్టించింది. గొర్రెల మందపైకి దూసుకెళ్లడంతో 15 జీవాలు అక్కడికక్కడే మృతి చెందాయ.అడ్డుకోబోయిన కాపరి సైతం తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు... బత్తలపల్లి మండలం కోడేకండ్ల గ్రామానికి చెందిన ఓబుళపతి జీవాల పెంపకంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం ఉదయం తన భార్య కామేశ్వరితో కలసి జీవాలను మేపునకు తోలుకు వెళ్లాడు. జ్వాలాపురం క్రాస్ వద్ద జాతీయ రహదారిని దాటిస్తున్న సమయంలో సేలం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ట్యాంకర్ దూసుకొస్తుండడం గమనించి ఓబుళపతి అడ్డుకోబోయాడు. అయినా డ్రైవర్ వేగాన్ని నియంత్రించుకోలేక కాపరిని ఢీకొని గొర్రెల మందపైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే 15 గొర్రెలు మృతి చెందాయి. కళేబరాలు ఛిద్రమై రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. మరో 25 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఓబుళపతి తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. కాపరి భార్య గట్టిగా కేకలు వేయడంతో పొలాల్లోని రైతులు, రోడ్డుపై వెళుతున్న వారు ట్యాంకర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో డ్రైవర్ వాహనాన్ని ఆపి అక్కడి నుంచి పారిపోయాడు. క్షతగాత్రుడిని స్థానికులు ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, బాధిత గొర్రెల కాపరి కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ బండి సరస్వతి, ఎంపీటీసీ సభ్యురాలు బండి రాములమ్మతో పాటు పలువురు గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించి స్థానిక అధికారులతో ఆరా తీసినట్లు సమాచారం. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా గొర్రెల కొనుగోలుకు రుణం అందించేందుకు అవకాశాలు పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది.
అడ్డుపడ్డ గొర్రెల కాపరికీ తీవ్రగాయాలు
15 గొర్రెలు మృతి, మరో 25 గొర్రెలకు తీవ్రగాయాలు
Comments
Please login to add a commentAdd a comment