రోడ్డు ప్రమాదాలకు చెక్ పెడదాం
ప్రశాంతి నిలయం: రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జాతీయ భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని రవాణాశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బ్యానర్లు, పోస్టర్లను కలెక్టర్ టీఎస్ చేతన్ ఎస్పీతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు తరచుగా జరిగే ప్రాంతాలపై దృష్టిసారించి ప్రమాదాల నివారణకు కృషిచేయాలన్నారు. ఎస్పీ వి.రత్న మాట్లాడుతూ పోలీస్, రవాణాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్‌ఓ విజయసారధి, డీటీఓ కరుణసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సర్వేని వేగవంతం చేయండి..
జిల్లాలో కుష్టు వ్యాధి సర్వేను వేగవంతంగా చేయాలని, ప్రతి ఇంటినీ ఏఎన్‌ఎం, వలంటీర్లు సందర్శించాలని, వైద్యఆరోగ్యశాఖ అధికారులు కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో కుష్టు నిర్మూలన, వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. 20 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ 14 రోజుల పాటు వైద్య ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఫిరోజ్ బేగం, జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ తిప్పయ్య తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా ఉచిత ఇసుక..
జిల్లాలో ఉచిత ఇసుక సరఫరాను పారదర్శకంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హల్‌లో జిల్లాలో ఉచిత ఇసుక అమలుపై డీఎస్‌ఎస్‌సీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన ఇసుకను సరఫరా చేయాల్సిన బాధ్యత మైనింగ్ అధికారుదేనన్నారు. ఎస్పీ వి.రత్న మాట్లాడుతూ ఎక్కడైనా ఇసుక అక్రమ తవ్వకాలు ,రవాణా జరుగుతుంటే డయల్ 100, 102కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. జేసీ అభిషేక్ కుమార్, డీఆర్‌ఓ విజయ సారధి, జిల్లా గనుల శాఖ అధికారి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలి
జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో జనవరి 26న పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో గణతంత్ర వేడుకల నిర్వహణపై అధికారులతో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర వేడుకలను అన్ని శాఖల అధికారులు కలిసి విజయవంతం చేయాలన్నారు. తాగునీరు, వసతి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ శకటాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేయాలన్నారు.
కలెక్టర్ టీఎస్ చేతన్
Comments
Please login to add a commentAdd a comment