వైకుంఠ వైభవం
కదిరి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గురువారం అర్ధరాత్రి నుంచే భక్తులు క్యూలైన్ల వద్ద బారులు తీరారు.
వేకువజామునుంచే దర్శనం..
వైకుంఠ ఏకాదశి ఘడియలు ప్రవేశించగానే శుక్రవారం వేకువ జామున 3 గంటల ప్రాంతంలో శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనారసింహుడిని వైకుంఠ ద్వారం (ఉత్తర గోపురం) వద్దకు చేర్చారు. ప్రత్యేక పూజల అనంతరం వేకువజాము నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఖాద్రీశుడు వైకుంఠ ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం మొత్తం వివిధ రకాల పుష్పాలు, పండ్లతో చేసిన అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.
తగ్గిన భక్తుల సంఖ్య..
ఏటా ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష మందికి పైగా భక్తులు నరసింహస్వామిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకునేవారు. అయితే ఈ మధ్యనే తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోవడంతో ఆ ప్రభావంతో కదిరిలో భక్తుల సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు. దాదాపు 80 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
పల్లకీపై వచ్చిన శ్రీవారు..
స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సతీసమేతంగా తెల్లవారు జామునే ఆలయం చేరుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి అలంకరణ అనంతరం శ్రీవారిని పల్లకీలో మోసుకుంటూ ఉత్తర రాజగోపురం వద్దకు తీసుకొచ్చారు. హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి స్వామివారిని దర్శించుకున్నారు.
చలిని లెక్కచేయని భక్తులు..
ఖాద్రీశుడి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు రాత్రి చలిని, పగలు మండుటెండను లెక్క చేయలేదు. సర్వదర్శనం కన్నా రూ.30 టికెట్ క్యూలైన్‌లోనే భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తుల రద్దీని ముందే ఊహించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి నేతృత్వంలో బందోబస్త్ ఏర్పాటు చేశారు.
జిల్లా వ్యాప్తంగా సందడి
హిందూపురం పేట వెంకటరమణస్వామి, ధర్మవరం చెన్నకేశవస్వామి ఆలయాలతో పాటు జిల్లాలోని అన్ని ఆలయాల్లో భక్తులు స్వామివార్లను ఉత్తర ద్వార దర్శనం చేసుకొని తరించారు. పలుచోట్ల స్వామి వారి ఉత్సవ మూర్తుల ఊరేగింపు వైభవంగా నిర్వహించారు.
భక్తులతో పోటెత్తిన ఖాద్రీశుడి ఆలయం
గురువారం అర్ధరాత్రి నుంచే
కిక్కిరిసిన క్యూలైన్లు
ఉత్తర ద్వారం నుంచి
స్వామిని దర్శించుకున్న భక్తులు
Comments
Please login to add a commentAdd a comment