అదనపు కట్నం వేధింపులు తాళలేకపోతున్నా...
పుట్టపర్తి టౌన్: తారాస్థాయికి చేరుకున్న అదనపు కట్నం వేధింపులు తాళలేకపోతున్నానంటూ ఎస్పీ రత్న ఎదుట బాధితురాలు బోరుమంది. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీకి వినతి పత్రం అందజేసి, మాట్లాడింది. వివరాలు... చిలమత్తూరు మండలం సొమగట్ట గ్రామానికి చెందిన సురేష్‌కుమార్‌కు మూడేళ్ల క్రితం కదిరి పట్టణానికి చెందిన అపరంజినితో వివాహమైంది. కొన్ని రోజులు వీరి కాపురం సజావుగా సాగింది. ఆ సమయంలోనే ఆమె గర్భం దాల్చింది. ఊహించని పరిణామాలతో అబార్షన్ జరిగి ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. అప్పటి నుంచి భర్త, అత్త, మామ అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఓ సారి బాధితురాలి తల్లి రూ.2 లక్షలు అందజేసింది. అయినా అత్తింటి వారిలో మార్పు రాలేదు. అదనపు కట్నం కోసం చిత్రహింసలు చేయసాగారు. తాము కోరుకున్న మొత్తం తీసుకురాకపోతే హతమార్చి మరో పెళ్లి చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఎస్పీ రత్నను బాధితురాలు వేడుకుంది. దీనిపై స్పందించిన ఎస్పీ వెంటనే కదిరి పీఎస్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. బాధితురాలికి న్యాయం చేయాలని సూచించారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 65 వినతులు అందాయి. ఎస్పీ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. చట్టపరిధిలోని సమస్యలకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేవించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, ఎస్పీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో
ఎస్పీకి ఫిర్యాదు
న్యాయం చేయండి సార్
బుక్కపట్నం మండలం గూనిపల్లికి చెందిన రౌడీ షీటర్ నాగిరెడ్డి తనను చీటింగ్ చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నాడని, ఈ విషయంగా తనకు న్యాయం చేయాలంటూ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు ఎదుట రాశింపల్లికి చెందిన బయపరెడ్డి వాపోయాడు. ఈ మేరకు ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. నాగిరెడ్డితో రూ.6 లక్షల అప్పు తీసుకుని రూ.లక్షకు ఒకటి చొప్పున ఆరు ప్రాంసరీ నోట్లను రాసి ఇచ్చినట్లు వివరించారు. ఏడాది తర్వాత రూ.6 లక్షలకు అసలు, వడ్డీ కలిపి చెల్లించానన్నారు. ఆ సమయంలో ఐదు ప్రాంసరీ నోట్లు తిరిగి ఇచ్చి ఒకటి కనిపించడం లేదంటూ తెల్ల కాగితంపై డబ్బు అంతా ముట్టినట్లు రాసిచ్చాడన్నారు. ఇటీవల తనకు డబ్బు చెల్లించాలంటూ ఇంటికి వచ్చి కుటుంబసభ్యులను దుర్బాషలాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడన్నారు. ఈ విషయంగా తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. దీనిపై స్పందించిన అడిషనల్ ఎస్పీ వెంటనే బుక్కపట్నం పీఎస్ ఎస్‌ఐ కృష్ణమూర్తితో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment