‘యంగ్ ఇండియా’ బేడీ ఇక లేరు
పెనుకొండ రూరల్: యంగ్ ఇండియా ప్రాజెక్టును స్థాపించి..ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ హక్కుల కోసం ఉద్యమించిన నరేంద్ర సింగ్ బేడీ(86) ఇకలేరు. వయో భారంతో సోమవారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలోని యంగ్ ఇండియా ఫారంలోని తన నివాసంలో కన్నుమూశారు. బేడీ 1939 సంవత్సరంలో కోల్‌కతాలో జన్మించారు. అమెరికాలో కెమికల్ ఇంజినీరింగ్ చదివి..కొంతకాలం అక్కడే ఉద్యోగం చేశారు. 1969లో స్వదేశానికి తిరిగొచ్చారు. 1975–76 మధ్య కాలంలో ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండకు వచ్చారు. పెనుకొండ మండలం గుట్టూరు వద్ద 44వ జాతీయ రహదారికి సమీపంలో యంగ్ ఇండియా ప్రాజెక్టు కార్యాలయాన్ని ప్రారంభించారు. తీవ్ర కరువు, పేదరికంతో జిల్లా కొట్టుమిట్టాడుతున్న ఆ రోజుల్లో రైతులు, గ్రామీణ శ్రామికులు, పేదల హక్కుల కోసం ఉద్యమించారు. భూ పోరాటాలతో పాటు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. యంగ్ ఇండియా ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేశారు. రైతు సహకార, వ్యవసాయ కూలీల, మహిళా సంఘాలను ఏర్పాటు చేసి..ఆయా వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వృద్ధిలోకి వచ్చేలా చైతన్య పరిచారు. దివ్యాంగులకు చేయూతనిచ్చారు. చేతి వృత్తిదారులు, కళాకారులను ప్రోత్సహించారు. విద్య, వైద్య, కరువు నివారణ, సుస్థిర వ్యవసాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు.
ఉపాధి హామీ కోసం ఉద్యమం..
పేదల అభివృద్ధికి ప్రభుత్వాల చేయూత కావాలనే సంకల్పంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం నరేంద్ర సింగ్ బేడీ ఉద్యమించారు. గుట్టూరులోని యంగ్ ఇండియా ప్రాజెక్ట్ ప్రాంగణం నుంచి సంస్థ సభ్యులతో కలసి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి వినతి పత్రం ఇచ్చారు. అలాగే లక్ష సంతకాలు సేకరించి.. సైకిల్ ర్యాలీగా వెళ్లి అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో అప్పటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి గుడిసెల రామస్వామికి వినతి పత్రం అందచేశారు. పేదరిక నిర్మూలనే కాకుండా, గ్రామాల అభివృద్ధికి సాధనంగా పనిచేసేలా గ్రామీణ ఉపాధి పథకం ప్రవేశపెట్టాలంటూ తన ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చారు. అలాగే చుండూరులో దళితులపై దాడులు, మారణహోమాన్ని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దళిత, గిరిజనులను చైతన్య పరిచారు. 1983లో భూ పోరాటాల్లో పాలుపంచుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలను రాజకీయంగా చైతన్య పరిచారు. ప్రశ్నించే హక్కును అలవాటు చేశారు. నరేంద్ర సింగ్ బేడీ.. మణిశంకర్ అయ్యర్, దిగ్విజయ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ లాంటి ప్రముఖులకు సమకాలికులు. మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ..బేడీకి మూడేళ్ల జూనియర్. ఈయనకు భార్య సోనియాబేడీ, కుమారులు రాజీవ్, సంజయ్, కుమార్తె తారా ఉన్నారు.
నేడు అంత్యక్రియలు..
నరేంద్ర సింగ్ బేడీ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం గుట్టూరు సమీపంలోని యంగ్ ఇండియా ప్రాజెక్ట్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వయోభారంతో కన్నుమూసిన సామాజిక ఉద్యమకారుడు
Comments
Please login to add a commentAdd a comment