ఎస్సీ ఉపకులాల సమగ్ర వివరాలు సిద్ధం చేయండి
అనంతపురం అర్బన్/ఎడ్యుకేషన్: ఎస్సీ ఉపకులాల వారీగా సమగ్ర వివరాలతో నివేదికలు సిద్ధం చేయాలని ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో అనంతపురం జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్, ఎస్పీ పి.జగదీష్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి జిల్లాలో ఎస్సీల జనాభా తదితర వివరాలను కమిషన్ చైర్మన్‌కు కలెక్టర్ వినోద్‌కుమార్ వివరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా జనాభా 40.81 లక్షలు కాగా, ఇందులో ఎస్సీలో 48 ఉపకులాలకు సంబంధించి జనాభా 5.83 లక్షలు (14.29 శాతం) ఉందని పేర్కొన్నారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన వారు 4,75,632 మంది, మాల సామాజిక వర్గానికి చెందిన వారు 73,525 మంది, మిగిలిన ఉపకులాలకు చెందిన వారు 33,843 మంది ఉన్నారని చెప్పారు. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, 4, క్లాస్–4, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 48,080 మంది ఉన్నారన్నారు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, వైద్య, పారామెడికల్, నర్సింగ్, ఇంజినీరింగ్ తదితర విద్యనభ్యసిస్తున్న ఎస్సీ, ఉపకులాలకు చెందిన విద్యార్థులు 4,15,677 మంది ఉన్నట్లు వివరించారు. మునిసిపల్, హౌసింగ్, మెప్మా, డీఆర్‌డీఏ బ్యాంక్ లింకేజీ, ఉపాధి హామీ తదితర పథకాల ద్వారా లబ్ధిపొందిన ఎస్సీ, ఉపకులాల వారి వివరాలను తెలియజేశారు.
కచ్చితమైన వివరాలు అందించాలి
ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ ఎస్సీ, ఉప కులాలకు సంబంధించి కచ్చితమైన వివరాలను సేకరించాలని ఆదేశించారు. వివరాల సేకరణలో తప్పిదాలు చోటు చేసుకుంటే న్యాయపరమైన సమస్యలు వస్తాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా పనిచేయాలని చెప్పారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్‌ఓ ఎ.మలోల, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎస్సీ సంఘాల నుంచి 237 వినతులు
ఏకసభ్య కమిషన్ చైర్మన్‌కు ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, మాల మహాసభ, ఎస్సీ కులాల జేఏసీ, జంగం హక్కుల పోరాట సమితి, ఇతర సంఘాల నాయకులు, ప్రతినిధులు, ఉద్యోగుల నుంచి 237 వినతులు అందాయి.
● కూటమి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలపై దౌర్జన్యాలు పెరిగి పోయాయని వైఎస్సార్ సీపీ శింగనమల నియోజకవర్గ ఎస్సీసెల్ నాయడులు వరికూటి కాటమయ్య ఏక సభ్య కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే చైర్మన్ స్పందిస్తూ... ఈ నెల 31న నియోజకవర్గంలోని వెంకటాపురం గ్రామంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించి, సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధికార యంత్రాంగానికి సూచించారు.
● ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేసి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడిన మాదిగ, ఉప కులాలకు న్యాయం చేయాలని రాజీవ్ రంజన్ మిశ్రాను పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, గృహ నిర్మాణాలు, భూమి కొనుగోలు పథకం, స్కిల్ డెవలప్‌మెంట్, ఉద్యోగ నియామకాల్లోనూ కర్షకులు, కార్మికులకు ఎలాంటి లబ్ధి జరగలేదన్నారు. వర్గీకరణ జరిగితేనే ఉపకులాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
అధికారులకు ఏకసభ్య కమిషన్
రాజీవ్ రంజన్ మిశ్రా ఆదేశం
ఎస్సీ సంఘాల ప్రతినిధుల నుంచి
237 వినతులు
Comments
Please login to add a commentAdd a comment