నేడు జిల్లాకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు
కదిరి అర్బన్: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతు హుస్సేన్ మంగళవారం జిల్లాకు విచ్చేస్తున్నారు. బెంగళూరు నుంచి రోడ్డుమార్గాన జిల్లాకు చేరుకోనున్న ఆయన, తొలుత కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం మండల పరిధిలోని బోడేనాయక్ తండా, రాందాస్‌నాయక్ తండాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
ప్రత్యేక న్యాయమూర్తిగా రమణయ్య
హిందూపురం అర్బన్: స్థానిక ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా ఎస్. రమణయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేసిన ప్రత్యేక న్యాయమూర్తి నాలుగేళ్ల క్రితం పదవీ విరమణ పొందడంతో అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఇటీవల రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను హైకోర్టు భర్తీ చేసింది. ఈ క్రమంలోనే విశ్రాంత జడ్జి రమణయ్యను హిందూపురం ప్రత్యేక న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజను మర్యాద పూర్వకంగా కలిశారు. అదే విధంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తదితరులు ప్రత్యేక న్యాయమూర్తి రమణయ్యను కలిసి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఎస్.రమణయ్య గతంలో హిందూపురం మెజిస్ట్రేట్‌గా, ఇన్‌చార్జ్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేశారు. అలాగే అనంతపురంలోని కార్మిక న్యాయస్థానం జడ్జిగా పనిచేస్తూ జిల్లా జడ్జి స్థాయిలో పదవీ విరమణ పొందారు.
కదిరి వాసికి
అరుదైన గౌరవం
కదిరి అర్బన్: అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) మధురై డైరెక్టర్‌గా ఉన్న కదిరి వాసి డాక్టర్ మంగు హనుమంతరావ్‌కు అరుదైన గౌరవం దక్కింది. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలంటూ రాష్ట్రపతి భవన్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది.
వైద్యరంగంలో జాతీయస్థాయిలో పేరుగాంచిన ప్రముఖుల్లో ఈ ఏడాది 15 మందికి మాత్రమే ఆహ్వానాలు అందగా, హనుమంతరావ్ కూడా ఒకరు. తిరుపతి స్విమ్స్‌లో డైరెక్టర్‌గా 30 ఏళ్ల పాటు సేవలందించిన హనుమంతరావ్...అంతర్జాతీయ వైద్య విజ్ఞాన పత్రికల్లో 100కుపైగా ప్రచురణలు చేశారు.
8న నవోదయ ప్రవేశ పరీక్ష
లేపాక్షి: జవహర్ నవోదయ విద్యాలయలో 9, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం (2025–26 విద్యా సంవత్సరం) దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఫిబ్రవరి 8వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9వ తరగతికి ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1,084 మంది విద్యార్థులు, 11వ తరగతిలో ప్రవేశానికి 1,228 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. 9వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం లేపాక్షి నవోదయ విద్యాలయతో పాటు మహాత్మాగాంధీ జ్యోతిబాపూలే గురుకుల కళాశాలలో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా 11వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం హిందూపురంలోని నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. www. navodaya.in వెబ్‌సైట్ నుంచి విద్యార్థులు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
‘పీఎం ఇంటర్నషిప్’ను
సద్వినియోగం చేసుకోండి
పుట్టపర్తి: నిరుద్యోగ యువత పీఎం ఇంటర్నషిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాశాఖ అధికారి రఘునాథరెడ్డి సూచించారు. సోమవారం ఆయన కొత్తచెరువులోని విలేకరులతో మాట్లాడారు. ‘పీఎం ఇంటర్నషిప్’ పథకం అమలు కోసం ప్రభుత్వం 500 కంపెనీలతో ఒప్పందం చేసుకుందన్నారు. ఇంటర్నషిప్‌కు ఎంపికై న వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. అలాగే వన్‌టైమ్ గ్రాంటు కింద రూ.6 వేలు, ప్రతి నెల రూ.5 వేల చొప్పున ఇస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment