30న జెడ్పీ సమావేశం
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 30న నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ సోమవారం ఆమోదం తెలిపారు. వాస్తవంగా ఫిబ్రవరి 7న సమావేశం నిర్వహించాలని జెడ్పీ అధికారులు భావించారు. అయితే అదే నెల ఒకటో తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. దీంతో తమ నిర్ణయాన్ని జెడ్పీ అధికారులు మార్చుకుని,. కొత్తతేదీ ఫైల్‌ను చైర్‌పర్సన్‌కు పంపగా ఆమె ఆమోదం తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కో–ఆప్షన్, జెడ్పీటీసీ సభ్యులు, అన్ని శాఖల అధికారులకు సమాచారం పంపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది.
శ్రీ సత్యసాయి కలెక్టర్ వస్తారా..?
జెడ్పీ సమావేశాలకు, స్టాండింగ్ కమిటీ సమావేశాలకు శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ డుమ్మా కొడుతున్నారు. మరికొన్ని శాఖల అధికారులు కూడా రావట్లేదు. ఈ అంశంపై సభ్యులు, ప్రజాప్రతినిధులు నిలదీస్తూ వస్తున్నారు. పునర్విభజన తరువాత తొలిసారి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన బసంత్‌కుమార్ మాత్రమే క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరయ్యేవారు. ఆ తరువాత వచ్చిన కలెక్టర్లు జెడ్పీ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ అంశంపై గత సమావేశంలో ప్రజాప్రతినిధులు, సభ్యులు గట్టిగా నిలదీశారు. కలెక్టరే లేకుంటే ఇక తామెందుకు రావాలని అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ రాకపోతే వచ్చే సమావేశాన్ని బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. అయితే అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ కలుగజేసుకొని వచ్చే సమావేశానికి కచ్చితంగా ఆయన వచ్చేలా చూస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలో త్వరలో జరగబోయే సమావేశానికై నా శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ వస్తారా లేదా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment