పురంలో నకిలీ నోట్ల కలకలం
హిందూపురం అర్బన్: జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపుతున్నాయి. నెలరోజుల క్రితం బత్తలపల్లిలో ఓ చిరువ్యాపారికి, ఇటీవలే కదిరిలో ఓ గొర్రెల వ్యాపారికి రూ.32 వేల విలువ జేసే రూ.500 నకిలీ నోట్లు అంటగట్టిన వైనం మరవకముందే తాజాగా సోమవారం హిందూపురంలోనూ నకిలీనోట్లు కలకలం సృష్టించాయి. ఓ చిల్లర దుకాణదారుని వద్ద నిత్యావసర సరకులు కొనుగోలు చేసిన వ్యక్తి సోమవారం రూ.500 నోట్లు మూడు ఇచ్చాడు. అయితే వాటిని మరో వ్యక్తికి ఇచ్చే తరుణంలో అవి నకిలీవని గుర్తించిన వ్యాపారి వెంటనే వాటిని చించేశాడు. ఫిర్యాదు చేస్తే విచారణ పేరుతో పోలీసుల నుంచి ఇబ్బందులు వస్తాయన్న భయంతోనే వ్యాపారి నకిలీ నోట్లను చించేసినట్లు తెలుస్తోంది. రోజుకోచోట నకిలీ నోట్లు చేతులు మారుతుండటంతో ఏది నకిలీ.. ఏది అసలో గుర్తించలేక జనం ఆందోళనకు చెందుతున్నారు. అసలు నోటును పోలిన నకిలీ నోట్లు మార్కెట్‌లో చలామణి చేస్తుండటంతో ప్రతి నోటు చూసి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నకిలీ నోట్లను ఇలా గుర్తిస్తున్నారు
● నకిలీ నోట్లపై మధ్యన త్రెడ్ ఉన్నా... నోటు తిప్పినప్పుడు అది బ్లూ కలర్ రంగులోకి మారడం లేదు.
● నోటు చివర మీడ్‌లైన్స్ (నల్లగా ఉండే చారలు) ఉబెత్తుగా కాకుండా మామూలుగా ఉంటున్నాయి.
● నోటుకు ఎడమ చివర భాగంలో ఫ్లవర్‌పై 500 నంబర్ ఉండటం లేదు.
● నోటు ముందుభాగంలోని గాంధీ బొమ్మ సరిగ్గా కనిపించడం లేదు. వీటిని బట్టి వ్యాపారులు నకిలీ నోట్లను గుర్తించ గలుగుతున్నారు. అయితే సామాన్యులు నకిలీ నోట్లు గుర్తించక ఇబ్బందులు పడుతున్నారు.
కోయంబత్తూరు, చెన్నెయ్ నుంచే సరఫరా..?
నకిలీ కరెన్సీ నోట్లు కోయంబత్తూరు, చెన్నెయ్‌లలో ముద్రించి కర్ణాటక మీదుగా జిల్లాలోకి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కువగా ఒక రూ.500 నోట్లే ఉంటున్నాయి. అసలు నోటుకు మూడు నకిలీ నోట్లు ఇవ్వడం, కొందరి అమాయకుల వద్ద నేరుగా మార్చడం చేస్తున్నారు. ప్రధానంగా 9ఎఫ్‌బీ 248053, 2టీవీ 175028 సీరీస్ గల నకిలీ నోట్లు జిల్లాలో బయట పడ్డాయి. కదిరి, హిందూపురం, మడకశిర, ధర్మవరం ప్రాంతాల్లో నకిలీ నోట్ల మారకం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment