డీపీఓ సమీపంలో ఎగిసి పడిన మంటలు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయం (డీపీఓ) సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం కార్యాలయం ఆవరణలోని ఎండుగడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రజా సమప్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరైన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అడిషనల్ ఎస్పీ ఎ.శ్రీనివాసులు సమాచారం ఇవ్వడంతో అగ్రిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసింది. ఘటనను ఎస్పీ రత్న తీవ్రంగా పరిగణిస్తూ సెంట్రీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిప్పు రాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గ్రేటర్ రాయలసీమ ఇమామ్ మౌజన్ కౌన్సిల్ ఏర్పాటు
హిందూపురం టౌన్: పట్టణంలోని ముస్లిం నగారా కార్యాలయంలో గ్రేటర్ రాయలసీమ ఇమామ్ మౌజన్ కౌన్సిల్‌ను సోమవారం ఏర్పాటు చేశారు. అఖిల భారత ఫ్రీడం ఫైటర్ షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఖాజీ అన్సార్ పాల్గొన్నారు. కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడిగా మౌలానా వసీవుల్లా, హిందూపురం పట్టణ అధ్యక్షుడిగా మౌలానా తన్వీర్ అహమ్మద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇమామ్ మౌజన్ల హక్కుల కోసం కౌన్సిల్ చట్ట బద్దంగా పోరాడుతోందన్నారు. అనంతరం గ్రేటర్ రాయలసీమ ఇమామ్ మౌజన్ కౌన్సిల్ క్యాలండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉబెదుల్లా హుస్సేన్, మౌలానా రిజా–ఉర్–రహమాన్, మౌలానా ఉస్మాన్ ఘనీ, మౌలానా సాజిద్, మౌలానా షాబుద్దీన్, మౌలానా అన్సారీ, హాజీ నాసీర్ తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
మడకశిర రూరల్: మండలంలోని కల్లుమర్రి గ్రామానికి చెందిన రామాంజప్ప (50) ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసైన ఆయన జులాయిగా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఈ క్రమంలో మద్యం కొనుగోలుకు డబ్బు కావాలంటూ తరచూ కుటుంబసభ్యులను వేధించేవాడు. సోమవారం మద్యం కొనుగోలుకు తనకు డబ్బులివ్వాలంటూ భార్య సంజమ్మ, కుమారుడు, కుమార్తెను వేధించాడు. తమ వద్ద డబ్బు లేదని తెలపడంతో గ్రామంలోని పాఠశాల ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై సంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment