ప్రజా సమస్యలు పరిష్కరించాలి
ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 251 అర్జీలు అందగా, వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం జేసీ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఇస్తే సమస్య పరిష్కారమవుతుందన్న నమ్మకంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడి వరకూ వచ్చి అర్జీలిస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలన్నారు. అర్జీదారుడితో నేరుగా మాట్లాడితే సమస్య క్షుణ్ణంగా తెలుస్తుందని, అప్పుడు పరిష్కారం సులువు అవుతుందన్నారు. పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించినట్లు చూపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హౌస్ హోల్డ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. కోర్టు కేసులు, వివిధ కేసుల్లో కోర్టు ఆదేశాలను క్షుణ్ణంగా చదివి చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు జేసీ అభిషేక్‌కుమార్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment