కవిటి ఉద్దానం బీల ప్రాంతంలో పండిన యూటీఆర్181 వరిపైరు
కవిటి: రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సహాయ సహకారాలలో కవిటి ఉద్దానం ప్రాంతంలో అన్నదాతలు కొత్తరకం వరివంగడాల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. కవిటి మండలంలోని పలువురు రైతులు ఉటుకూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో అభివృద్ధి చేసిన నూతన రకం వరివంగడం యూటీఆర్181ను సాగు చేసి మంచి దిగుబడులు సాధించా రు. ఈ విత్తనాల్ని కృష్ణాజిల్లాకు చెందిన రైతు ఉప్పల హరిప్రసాద్ నుంచి కవిటి మండలానికి చెందిన పలువురు రైతులు సొంతఖర్చులతో తీసుకొచ్చారు. 150–160 రోజుల పంటకాలం కలిగిన ఈ పంటను ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేశారు. కేవలం 20 కిలోల విత్తనం ఎకరం విస్తీర్ణంలో పొలంలో సంప్రదాయ పద్ధతిలో నాట్లు వేశారు.
లోడెన్సిటీ పద్ధతిలో సాగు చేయాలని యూట్యూబ్‌లో పరిశీలించిన రైతులు ఆ విధంగానే తక్కువ విత్తన ఖర్చుతో నారుమడులు సిద్ధం చేసుకున్నారు. ఒక్కో చిగురు మాత్రమే నాటడంతో దాని నుంచి 20 పిలకలకు పైగా అది అభివృద్ధి చెంది దుబ్బుచేసింది. పచ్చి రొట్ట పైరువేసి దమ్ము చేసి ప్రధాన పొలంలో నత్రజని పైపాటుగా వేసే అవసరం లేకుండానే సాగుచేశారు. పంటకాలం మధ్యలో స్వల్పమోతాదులో మిశ్రమ ఎరువును పైపాటుగా అందించారు. నత్రజని వినియోగం లేని కారణంగా చీడపీడల బెడద తప్పింది. ఇటీవలే కోతలు కూడా పూర్తయ్యాయి. ఎకరానికి 30 నుంచి 35 బస్తాల దిగుబడి సాధించినట్టు రైతులు చెబుతున్నారు. సాగునీటి లభ్యత బాగా ఉండే ప్రాంతానికి మంచి అనువైన రకంగా రైతులు భావిస్తున్నారు. చేను కూ డా ఏపుగా ధృడంగా ఉండడంతో వరదలు, అధిక వర్షాల ధాటికి కూడా తట్టుకునే వీలుందని భావిస్తున్నారు. విత్తనాలు అవసరమైన రైతులు తమను సంప్రదిస్తే విత్తనాలు కూడా సరసమైన ధరకే అందించేందుకు సిద్ధమని రైతులు చెబుతున్నారు.
తెగుళ్లను తట్టుకుంది
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఎదురైనా మండలంలో సాగుచేసిన యూటీఆర్181 రకం వరి ఖరీఫ్‌లో మంచి దిగుబడులు అందించింది. 34 బస్తాల వరకు దిగుబడులు వచ్చినట్టు రైతులు చెబుతున్నారు. ప్రధానంగా అగ్గితెగులు, దోమపోటు, పాముపొడతెగులు వంటి చీడపీడల బెడద ఈ పైరుకు ఆశించకపోవడం మంచి పరిణామం. ఉద్దానం ప్రాంతానికి ఇది అనువైన రకంగా కనిపించింది.
– కె.జగన్మోహనరావు, సహాయ వ్యవసాయ సంచాలకులు,
సోంపేట సబ్‌డివిజన్.
కొత్త రకం పంట పండింది
మా నాన్న నన్ను డిగ్రీవరకు చదివించారు. వ్యవసాయం మా ప్రధాన వృత్తి. ప్రతి ఏటా కొత్తరకం వరి విత్తనాలు సాగుచేయడం నాకు అలవాటు. ఈ ఏడాది కృష్ణాజిల్లా నుంచి యూటీఆర్181 రకం వరివిత్తనాలు తెప్పించాం. పంట పండింది. నా మొౖబైల్ నంబర్9951396558. విత్తనాలు అవసరమైతే సంప్రదించవచ్చు.
– బెందాళం వరప్రసాద్, ప్రగడపుట్టుగ, కవిటి మండలం
నీటి ఎద్దడి పరిస్థితుల్లోనూ చక్కటి దిగుబడులిచ్చిన యూటీఆర్ 181 రకం వరి
ఉద్దానం బీల ప్రాంతానికి అనువైన రకంగా రైతుల ఆనందం
అత్యంత సన్నరకం ధాన్యం కావడంతో ధరలోనూ కలిసివచ్చే అంశం
Comments
Please login to add a commentAdd a comment