అమరజీవికి అవమానం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): అమరజీవి పొట్టి శ్రీరాములును అధికారులు, అధికార పార్టీ నేతలు విస్మరించారు. నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రతి ఏటా జరుపుకునే ఆనవాయితీ ఉంది. శ్రీకాకుళం నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి పది అడుగుల దూరంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎవరూ కనీసం ఓ పూలదండనైనా వేయలేకపోయారు. కలెక్టర్‌తో పాటు మిగిలిన జిల్లా అధికారులు, కార్పొరేషన్ అధికారులు, కూటమి నేతలంతా అమరజీవిని మరిచిపోయారు. ఆర్యవైశ్య కులానికి చెందిన వారు మాత్రమే దండలు వేసి గౌరవించారు.
సనపల సురేష్ కుమార్ హౌస్ అరెస్టు
బూర్జ: మండలంలో గల గుత్తావల్లి గ్రామానికి చెందిన స్వతంత్య్ర అభ్యర్థి సనపల సురేష్ కుమార్‌ను హౌస్ అరెస్టు చేసినట్లు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించిన సందర్భంగా శుక్రవా రం స్థానిక పోలీసులు హౌస్ అరెస్టు చేసినట్లు ఆయన తెలియజేశారు. వైద్యం కోసం విశాఖ పట్నం వెళ్తున్నా స్థానిక పోలీసులు తన ఇంటికి వచ్చి హౌస్ అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
పాతపట్నంలో భారీ వర్షం
పాతపట్నం: మండలంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాదాపు గంట పాటు ఏకధాటిగా కురిసిన వానకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొరసవాడ, కాగువాడ, పెద్దసీది, రొంపివలస, గంగువాడ, ఆర్.ఎల్.పురం, తెంబూరు తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది.
అవినీతి రహిత సమాజమే ధ్యేయం
శ్రీకాకుళం క్రైమ్ : అవినీతి రహిత సమాజానికి తమ వంతు కృషి చేయాలని జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ బర్ల ప్రసాదరావు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా.. శుక్రవారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఆ ఽశాఖ డైరెక్టర్ జనరల్ హరీష్ గుప్తా ఆదేశాల మేరకు రామలక్ష్మణ సమీపంలోని కార్యాలయం నందు అధికారులు, సిబ్బందితో విజిలెన్స్ ఎస్పీ ప్రతిజ్ఞ నిర్వహించారు.
చంద్రబాబు పర్యటనతో ఒరిగిందేమీ లేదు
టెక్కలి: చంద్రబాబు పర్యటనతో జిల్లాకు ఒరిగిందేమి లేదని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సూపర్ సిక్స్ హామీల నుంచి తప్పించుకోవడానికే పర్యటనల పేరుతో హడావుడి చేస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదన్నారు. చంద్రబాబు పాలనలో ఏనాడైనా జిల్లా అభివృద్ధి కోసం పట్టించుకున్నారా అని తిలక్ ప్రశ్నించారు. గతంలో టీడీపీ జిల్లాలో పోర్టు కడతామని చెబుతూ కాలయాపన చేశారని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ఎంతో చిత్తశుద్ధిగా వ్యవహరించి జిల్లాకు పోర్టు తీసుకువచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు జిల్లా పర్యటనలో సాగునీటి ప్రాజెక్టుల కోసం కనీసం ప్రస్తావన చేయకపోవడం శోచనీయమన్నారు. కేవలం నెలల వ్యవధి పాలనలోనే కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజలు గమనించారని.. ఎప్పుడు ఎన్నికలోస్తాయా.. కూటమి ప్రభుత్వాన్ని కూలదోస్తామా..అని ఎదురుచూస్తున్నారని తిలక్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment