కొత్త పింఛన్లకు గ్రహణ కాలం | - | Sakshi
Sakshi News home page

కొత్త పింఛన్లకు గ్రహణ కాలం

Published Mon, Nov 11 2024 12:43 AM | Last Updated on Mon, Nov 11 2024 1:18 PM

-

పెండింగ్‌లో 20వేలకు పైగా దరఖాస్తులు

కొత్త దరఖాస్తులు అప్‌లోడ్‌ కాకుడా ఆన్‌లైన్‌ ఆప్షన్‌ తీసివేత

50 ఏళ్లకే పింఛన్‌ హామీ గాలికి

అర్హత ఉన్నా పింఛన్‌ రాక నష్టపోతున్న వృద్ధులు, వితంతువులు

నేడు ఇలా..

కొత్తగా పింఛన్‌కు దరఖాస్తు చేసుకునే వీలు లేకుండా ఆన్‌లైన్‌ ఆప్షన్‌ను తీసేశారు. పింఛన్‌ కావాలంటే అర్హత కలిగిన వారు కూటమి నాయకుల వద్దకో, ప్రభుత్వ కార్యాలయాల వద్దకో వెళ్లక తప్పదు. ఒకవేళ దరఖాస్తు పెండింగ్‌లో ఉంటే ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలో తెలీదు. కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు నెలలవుతున్నా కొత్త లబ్ధిదారుల జాబితాలు లేనేలేవు. 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామన్న నాయకులు.. ఆ మాటనే మర్చిపోయారు.

నాడు అలా..

వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో అర్హత ఉంటే చాలు వలంటీర్‌ ఇంటి వద్దకు వచ్చి కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు తీసుకుని, ఆ వలంటీరే స్వయంగా సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసేవారు. పరిశీలనలు సకాలంలో పూర్తి చేసుకుని పింఛన్‌ మంజూరు చేయడం, ఇంటికే నేరుగా వెళ్లి పింఛన్‌ అందించడం జరిగేది. ఎవరినీ అడగకుండా, ఎలాంటి వ్యయ ప్రయాసలకు గురి కాకుండా అర్హులు పింఛన్లు అందుకునేవారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌:  కూటమి ప్రభుత్వంలో కొత్త పింఛన్లకు చంద్రగ్రహణం పట్టుకుంది. నెలలు గడుస్తున్న కొద్దీ పింఛన్‌ లబ్ధిదారుల జాబితాలో సంఖ్య తగ్గుతోందే గానీ.. కొత్తవి మంజూరు కావడం లేదు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్ల హా మీ నెరవేరనేలేదు. గత ప్రభుత్వంలో ఏటా జనవరి, జూలై నెలల్లో అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేసే వారు. గ్రామ, వార్డు సచివాలయా ల ద్వారా పనులు సక్రమంగా జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.

హామీల అమలు ఎప్పుడు?

50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్లు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల సభలోనూ కూటమి నేతలు పదేపదే ఈ అంశాన్ని ప్రస్తావించారు. జిల్లాలో 50 నుంచి 60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రెండున్నర లక్షల మంది వరకు ఉండగా వారిలో 60 శాతం మంది అర్హులు ఉంటారని అంచనాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెల లు అయినా కొత్త పింఛన్ల కోసం ఎలాంటి చర్యలు లేవు. ఈ పింఛన్ల మాట కూడా మాట్లాడడం లేదు.

అక్కర్లేని హడావుడి

కొత్త పథకాలు ప్రవేశ పెట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక్క కొత్త పింఛను కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. గతంలో వచ్చిన పింఛను లబ్ధిదారులకు అందజేయడంలో మాత్రం ఎక్కడలేని హడావుడి చేస్తున్నారు. గతంలో మంజూరైన పింఛన్లు కూడా తామే మంజూరు చేసినట్లు ఫొటోలకు ఫోజులు ఇచ్చి చోటా నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు.

కొత్త పింఛన్లు ఏవీ..?

ఈ ఏడాది జనవరిలో జిల్లా లో కొత్త పింఛన్లను నాటి ప్రభుత్వం మంజూరు చేసింది. తర్వాత మళ్లీ జూన్‌లో కొత్తవారిని లబ్ధిదారుల జాబితాలో చేర్చాల్సి ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం పింఛన్‌ దరఖాస్తు చేసే ఆప్షన్‌ను మూసి వేయడంతో కొత్త పింఛన్లు రావడం లేదు. మండల జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమంలో పింఛన్‌ సాయం కోసం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారంతా అధికారుల వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నా.. వినేవారు లేరు.

గత ఐదు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 25 వేలకు పైగా పింఛన్ల కోసం దరఖాస్తులు వచ్చినట్లు మీ కోసం రికార్డులు చెబుతున్నాయి. దీనికి తోడుగా కూటమి నేతలు ఇచ్చిన హామీ ప్రకారం 50 దాటిన వారికీ అర్హత ఉంది. అంటే సుమారుగా 2,22,000 మందికి కొత్త పింఛన్లు అందజేయాల్సి ఉంది. కానీ ఈ అంశంపై ఎవరూ నోరు విప్పడం లేదు.

కొత్త పింఛన్లకు అవకాశమే లేకుండా జాగ్రత్త పడిన ప్రభుత్వం.. పాత వాటికి కూడా కోత పెడుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి 3,24,316 ఉండేవి. అవి నవంబర్‌ నెల నాటికి 3,15,630కి చేరాయి. మొత్తం 8,686 పింఛన్లు తగ్గాయి. కొత్త పింఛను ఒక్కటీ ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. దీంతో లబ్ధిదారులు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement