ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి
● మరొకరికి తీవ్రగాయాలు
ఆమదాలవలస: పట్టణ సమీపంలోని శ్రీకాకుళం నుంచి పాలకొండ వెళ్లే సీఎస్పీ రహదారిలో పార్వతీశ్వరునిపేట జంక్షన్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆమదాలవలస ఎస్‌ఐ కె.వెంకటేష్ తెలిపిన వివరాల మేరకు.. పాలకొండ నుంచి ఆమదాలవలస వైపు ఇద్దరు యువకులు బైక్‌పై వస్తున్నారు. ఇదే రహదారిలో శ్రీకాకుళం వైపు నుంచి పాలకొండ వైపు ఆర్టీసీ బస్సు వెళ్తోంది. అయితే యువకులు ప్రయాణిస్తున్న బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న వీరఘట్టం మండలం జె.గోపాలపురం గ్రామానికి చెందిన చంద్రశేఖర్(25) పడిపోగా బస్సు టైర్ ఆయన తలపైనుంచి వెళ్లడంతో ఘటన స్థలంలో మృతి చెందాడు. ఇదే బైక్‌ను డ్రైవింగ్ చేస్తున్న కూర్మినాయుడు తీవ్రంగా గాయపడడంతో పోలీసులు చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. వీరిద్దరూ ఆమదాలవలస పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న జలజీవన్ మిషన్ పైపులైన్ పనుల్లో రోజు కూలీలుగా పనిచేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. డీజిల్ క్యాన్‌తో వారు చేసే పనివద్దకు డీజిల్ తీసుకెళ్లేందుకు ద్విచక్రవాహనంపై వచ్చినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి ఆమదాలవలస, బూర్జ మండలాలకు చెందిన పోలీసులు చేరుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై ఆమదాలవలస ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు బుధవారమే కొత్తగా ప్రారంభించినట్లు సమాచారం. బస్సును ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment