చలో శ్రీకాకుళం విజయవంతం చేయండి
● ఎస్సీ ,ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి
ప్రతినిధులు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ)/శ్రీకాకుళం: ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్న భారీ ర్యాలీ, బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని ఎన్జీవో హోమ్‌లో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు విలేకరుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోరాట సమితి నాయకుడు కల్లేపల్లి రాంగోపాల్, కన్వీనర్ తైక్వాండో శ్రీను, కో–కన్వీనర్ కంఠ వేణులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎస్సీలను వర్గీకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యుత్సాహం చూపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మేధావులు గొంతెత్తుతున్నా ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
వర్గీకరణతో అన్యాయం
వర్గీకరణ కారణంగా మాలలకి అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అందువలన వర్గీకరణకి వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. దీనిలో భాగంగానే శ్రీకాకుళం వేదికగా ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా భారీ ర్యాలీ, బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల జంక్షన్ నుంచి పాతబస్టాండ్, కిన్నెర జంక్షన్, జెడ్పీ జంక్షన్, సంతోషిమాత కోవెల జంక్షన్ల మీదుగా ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్దనున్న డచ్ బిల్డింగ్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వివరించారు. ర్యాలీ అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ తర్వాతే డీఎస్సీ నియామకాలు జరుపుతామని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని, అలా చేస్తే మాలలు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాలు తక్షణం పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో రాయి వేణుగోపాల్, సాకేటి నాగరాజు, సింకు రమణ, దేబారిక రాజు, పెయ్యిల చంటి, అబ్బాస్, పంకు మురళీ, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment