రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
● డివైడర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతి
కంచిలి: స్థానిక ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో వంట పనిచేస్తున్న చింతల త్రినాథ్, సుజాతల రెండో కుమారుడు లింగరాజు అలియాస్ మణికంఠ(23) గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మృతుడు మణికంఠ తన స్నేహితుడు నొళియా రుషికేష్‌తో కలిసి బుధవారం రాత్రి కంచిలిలో ఒక దాబాలో భోంచేసి ఇచ్చాపురంలో సినిమాకు వెళ్లారు. అక్కడ నుంచి అర్ధరాత్రి ఒంటి గంటకు బయల్దేరి బుల్లెట్ వాహనంపై వస్తుండగా మండలంలోని జాడుపూడి కాలనీ వద్దకు వచ్చేసరికి వాహనం అదుపుతప్పింది. దీంతో వాహనం డివైడర్‌ను ఢీకొనడంతో బండి నడుపుతున్న లింగరాజు అలియాస్ మణికంఠకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం వెనుక కూర్చున్న రుషికేష్ ఎగిరిపడి రోడ్డు మీద పడినప్పటికీ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న హైవే అంబులెన్స్ వాహనం హుటాహుటిన అక్కడికి చేరుకొని మణికంఠ మృతదేహం, గాయాలపాలైన రుషికేష్‌ను సోంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మణికంఠ మృతదేహానికి గురువారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. రుషికేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్ఐ పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విదేశాలకు వెళ్లాల్సి ఉండగా...
మృతుడు మణికంఠం డిసెంబర్ 7వ తేదీన మలేషియా వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. దీంతో ఈ కొద్దిరోజులు కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడుపుదామని భావించాడు. ఆ విధంగానే ఒకవైపు క్యాంప్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసుకొని, మరోవైపు సరదాగా గడుపుతున్న క్షణాల్లో ఈ విధంగా ప్రమాదం జరిగింది. అందివచ్చిన కుమారుడు అందరినీ విడిచి విగతజీవుడైన పరిస్థితిని చూసి తల్లి సుజాత, తండ్రి త్రినాథ్, మిగతా కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. మృతుడు ఇంతకుముందు కూడా విదేశంలో ఉద్యోగం చేసి వచ్చి, కొన్నాళ్లు కుటుంబంతో గడిపి, మళ్లీ ఉద్యోగానికి వెళ్లనుండగా ఈ విషాదం చోటుచేసుకొంది.
Comments
Please login to add a commentAdd a comment