ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఈ ఏడాది కనీస స్థాయిలో కూడా ప్రవేశాలు జరగలేదు. ఏపీ పోస్టు గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ – 2024 ద్వా రా రెండు విడతల్లో ప్రవేశాలు కల్పించారు. సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో ఈ ప్రవేశాలు కల్పించినా ఇంతవరకు తరగతులు ప్రారంభించ లేదు. మరో నెల రోజుల్లో మొదటి సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉండగా.. ఇప్పుడు ఉన్నత విద్యా మండలి స్పాట్ అడ్మిషన్ల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వర్సిటీలో శుక్రవారం తక్షణ ప్రవేశాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్సిటీలో 16 కోర్సుల్లో 562 సీట్లు ఉన్నాయి. 247 ప్రవేశాలు జరిగాయి. 315 సీట్లు ఖాళీగా ఉన్నాయి. రెండు విడతలు కౌన్సెలింగ్‌లో, సెట్ అర్హత ద్వారా నిర్వహించిన స్పాట్ ప్రవేశాల్లో కౌన్సెలింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం మరోసారి కౌన్సెలింగ్‌ను సెట్ ర్యాంకుతో సంబంధం లేకుండా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సైన్స్ కోర్సుల్లో మాత్రమే మెరుగైన ప్రవేశాలు జరిగాయి. కొన్ని కోర్సుల్లో కనీస స్థాయిలోనూ ప్రవేశాలు జరగ లేదు. వాస్తవానికి 50 శాతం ప్రవేశాలు ఉంటేనే కోర్సుల నిర్వహణ సాధ్యం. 40 మంది విద్యార్థులు ఉంటే కోర్సుల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల మేరకు ఐదుగురు అర్హులైన బోధకులు ఉండాలి. నిర్వహన ఖర్చు నెలకు రూ.లక్షల్లో ఉంటుంది. ఇక్కడ మాత్రం విద్యార్థులు కనీస స్థాయిలో లేకపోవడంతో లక్షలాది రూపాయలు వృథా అవుతున్నాయి. కాగా, స్పాట్ ప్రవేశాల విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించి రెగ్యులర్ విద్యార్థులతో కలిసి పరీక్షలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ప్రభుత్వ రాయతీలు వర్తించవు...
స్పాట్ అడ్మిషన్లకు ప్రభుత్వ రాయతీలు వర్తించవు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ మంజూరు కావు. ట్యూషన్ ఫీజు, వసతి గృహం ఫీజు, పరీక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సెల్ప్ ఫైనాన్స్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఆర్ట్సు, సైన్స్, కామర్స్ ఇలా కోర్సు బట్టి రూ.7500 నుంచి రూ.40 వేల వరకు ఫీజు స్ట్రక్చర్ ఉంది.
సద్వినియోగం చేసుకోవాలి..
ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు శుక్రవారం పీజీ మిగులు సీట్లకు ప్రవేశాలు నిర్వహిస్తాం. డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లు పొందవచ్చు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటలు వరకు ప్రక్రియ నిర్వహిస్తాం. ఉన్నత విద్యా మండలి నిబంధనలు మేరకు ప్రవేశాలు కల్పిస్తాం.
– పి.సుజాత, రిజిస్ట్రార్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలో
16 కోర్సులు
మొత్తం సీట్లు 562..
ప్రవేశాలు జరిగినవి 247
ఖాళీ సీట్లు 315
Comments
Please login to add a commentAdd a comment