ఆ హృదయం పదిలం
అరసవల్లి: కొండంత బాధను గుండెలో పెట్టుకుని ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం బిడ్డను చిరంజీవిని చేసింది. కన్నపేగును కోల్పోయి పుత్రశోకం అనుభవిస్తున్న సమయంలోనూ వారు చూపిన ఔదార్యం మరికొందరు అభాగ్యులకు కొత్త ఊపిరి ప్రసాదించింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్నుమూసిన కుమారుడి అవయవాలు దానం చేసేందుకు ముందుకువచ్చి ఆ తల్లిదండ్రులు ఆదర్శప్రాయంగా నిలిచారు. మందస మండల కేంద్రానికి చెందిన కొంకి జోగారావు(30) రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. శుక్రవారం అతని అవయవాలను మెడికవర్ ఆస్పత్రిలో వేరు చేసి చైన్నె, విజయవాడ, విశాఖ నగరాలకు తరలించారు. వివరాల్లోకి వెళితే..
మందస మండల కేంద్రానికి చెందిన జోగారావు విద్యుత్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 25వ తేదీన మందస–హరిపురం రోడ్డులో జరిగిన ప్రమాదంలో అతడి మెదడుకు గట్టి దెబ్బలు తగిలా యి. జిల్లా కేంద్రంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికి త్స అందిస్తుండగా గురువారం రాత్రి మృతి చెందాడు. దీంతో జోగారావు తల్లిదండ్రులు మల్లేశ్వరరావు, యల్లప్పలు కన్నీరుమున్నీరయ్యారు. అంతబాధలోనూ అవయవదానం ప్రతిపాదనకు ఒప్పు కుని ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు.
తల్లిదండ్రులు అవయవదానానికి ఒప్పుకున్న తర్వాత మెడికవర్ ఆస్పత్రిలో ప్రక్రియ మొదలుపెట్టారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ మహేశ్వరరెడ్డిల ఆదేశాల మేరకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వరకు రహదారి పొడవునా ఎలాంటి అవాంతరాలు లేకుండా గ్రీన్ చానెల్ ద్వారా సురక్షితంగా అవయవాలను తీసుకెళ్లేలా చర్యలు చేపట్టారు. ఆర్మ్‌డ్ రిజ ర్వ్ పోలీసుల వాహనాలు, రెండు ఎస్కార్టు వాహనాలు, అంబులెన్స్ ద్వారా విశాఖ ఎయిర్‌పోర్టు వరకు బందోబస్తును కల్పించారు. అక్కడి నుంచి జోగారావు గుండెను చైన్నెకి, కిడ్నీలను విశాఖ, లివర్‌ను విజయవాడలో అవసరమైన రోగులకు అమ ర్చేందుకు తరలించారు. అంతకుముందే జోగారా వు కళ్లను స్థానిక రెడ్‌క్రాస్ ప్రతినిధులు సేకరించా రు. ఈ సందర్భంగా ఆస్పత్రి వద్ద సిబ్బందితో పా టు స్థానికులంతా జోగారావు తల్లిదండ్రులను అభినందించారు. జోగారావు అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు. అవయవదాన ప్రక్రియ పూర్త య్యాక పార్థివదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. స్థానిక బలగ జంక్షన్ నుంచి బాధిత కుటుంబ సభ్యులు, మెడికవర్ ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, సామాజిక కార్యకర్తలంతా ర్యాలీగా వెళ్లి జోగారావుకు అంతిమ నివాళులర్పించారు.
రోడ్డు ప్రమాదంలో
మృతి చెందిన యువకుడు
అవయవదానానికి ఒప్పుకున్న తల్లిదండ్రులు
శ్రీకాకుళం మెడికవర్‌లో అవయవదానం
Comments
Please login to add a commentAdd a comment