No Headline
ఈ ఫొటో చూడండి. ఇసుక ర్యాంపు కోసం ఏకంగా నదిలో బాట వేసిన దృశ్యమిది. సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం నదులో బాటలు వేసి ధ్వంసం చేయకూడదు. ఇక్కడ అందుకు భిన్నంగా జరుగుతోంది.
ఈ ఫొటో చూడండి. గార ఇసుక డీసిల్టేషన్ స్టాక్ యార్ట్ ముసుగులో వర్క్ దక్కించుకున్న అమరావతికి చెందిన భవానీ ట్రావెల్స్ పేరుతో తెలుగు తమ్ముళ్లు చేస్తున్న అక్రమ దందా ఇది. సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ టిబ్యునల్ ఆదేశాల మేరకు నదిలో యంత్రాలతో ఎలాంటి తవ్వకాలు జరపకూడదు. కానీ, ఇక్కడవేవీ అమలు కావడం లేదు.
● కూటమి ప్రభుత్వం అడ్డగోలుతనం
● వంశధారను గుల్ల చేస్తున్న నిర్వాహకులు
● కాంట్రాక్టర్, స్థానిక నేతలు కుమ్మకై ్క దోచుకుంటున్న పరిస్థితి
● సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా తవ్వకాలు
● శ్మశాన వాటికను వదలని అక్రమార్కులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
అధికార ర్యాంపులో అక్రమాల జాతర జరుగుతోంది. అమరావతికి చెందిన ప్రభుత్వ పెద్దల చేతిలో ఇక్కడ ర్యాంపు ఉంది. స్థానిక నేతల భాగస్వామ్యంతో ఏకంగా సహజ వనరుల విధ్వంసమే జరుగుతోంది. వంశధార నది బక్కచిక్కిపోతున్నా, అక్కడున్న ఇన్‌ఫిల్టరేషన్ వెల్, ఓవర్ హెడ్ ట్యాంకుకు ముప్పు వాటిల్లుతున్నా, శ్మశాన స్థలాన్ని ఛిద్రం చేస్తున్నా అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. చుట్టు పక్కల మంచినీటి పంప్ హౌస్, ఓవర్ హెడ్ ట్యాంక్, శ్మశాన వాటిక, రక్షణ గోడ తదితరా లు ఉన్నా ఇక్కడెలా అధికారులు అనుమతిచ్చారో అర్థం కావడం లేదు. మండల కేంద్రం నుంచి కళింగపట్నం వరకు భైరి ఓపెన్ హెడ్ చానెల్ పిల్ల కాలువ ద్వారా పంట సాగవుతుంది. శివారు కావడంతో సాగునీరు లభ్యత కష్టం. రైతులు మోటారు పంపుసెట్లు మీద ఆధారపడుతూ పంటలు పండిస్తున్నారు. ఇసుక తవ్వకాల సమీపంలోనే 100కి పైగా వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. వీటిన్నింటికి భవిష్యత్‌లో నీరు అందే పరిస్థితి ఉండదు. అంతేకాకుండా ఇక్కడికి 7 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంది. తవ్వకాలు కారణంగా బ్యాక్ వాటర్ నదిలోకి వచ్చి భూగర్భ జలాలు కలుషితమయ్యే అవకాశం ఉంది.
సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా
సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను అస్సలు పట్టించుకోవడం లేదు. వాటి మార్గదర్శకాలను పాటించడం లేదు. అమరావతికి చెందిన కాంట్రాక్ట్ ఏజెన్సీ వంశధార నదిని గుల్ల చేసేస్తోంది. నదిలోకి యంత్రాలకు ప్రవేశం లేదు. వాటితో తవ్వకాలు జరపడకూదు. కానీ ఇష్టారీతిన తవ్వకాలు చేస్తున్నారు. నదిలోకి దింపి నేరుగా వాహనాలకు లోడింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. వాస్తవంగా జిల్లా కమిటీ నిర్ధేశించిన వ్యక్తుల సమక్షంలో తవ్వకాలు జరపాలి. తవ్విన పరిమాణం ఎంతో ఎప్పటికప్పుడు కొలత లేసి లెక్కించాలి. కానీ ఇక్కడ అటువంటివేవి జరగడం లేదు. జిల్లా కమిటీ సూచించిన వ్యక్తులు ఏం చేస్తున్నారో ఎక్కడుంటున్నారో తెలియడం లేదు. కాంట్రాక్ట్ దక్కించుకున్న భవానీ ట్రావెల్స్ ఏజెన్సీ పేరుతో కొందరు తెలుగు తమ్ముళ్లే అంతా తామై వ్యవహరిస్తున్నారు. నచ్చినట్టుగా వసూలు చేసి, తోచిన రశీదులిచ్చి ఇసుక దందాను యథేచ్ఛగా కానిచ్చేస్తున్నారు. ఇక్కడ రోజుకి అడ్డగోలు బిజినెస్ రూ.లక్షల్లోనే ఉంది. ఎంత ఇసుక ఇక్కడి నుంచి తరలిపోతుందో లెక్కాపత్రం లేదు. ఇక్కడ అడ్డగోలుగా దోపిడీ జరుగుతోంది. ఇంత జరుగుతున్నా అధికార వర్గాలు ఏం మాట్లాడటం లేదు.
నిబంధనలకు తిలోదకాలు..
ర్యాంపులో పగటి పూట మాత్రమే తవ్వకాలు జరపాలి. కానీ, రాత్రి వేళల్లో తవ్వకాలు జరిపి, తరలిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 21వ తేదీ రాత్రి ఇసుక తరలిస్తున్న వాహనాలు స్థానికులు అడ్డుకున్నారు. రోడ్డు పక్కన ఉన్న బిల్డింగులు ఊగుతున్నాయని, చిన్నారులకు నిద్ర కరువైవుతుందని వాహనాలు నిలిపేసి అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి సర్దిచెపి కొద్ది రోజుల పాటు నిలిపేసారు. మళ్లీ ఏదోవిధంగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. నదిలో ఇసుక తవ్వకాలపై సీసీ కెమెరాలు పెట్టాలని గ్రీన్‌ట్రిబ్యునల్ స్పష్టంగా ఆదేశాలిచ్చింది. జిల్లాలోని మండల కేంద్రం, పేరున్న కళింగపట్నం రోడ్డుపక్కనే జరుగుతున్న పట్టించుకోని పరిస్థితి ఉంది.
ఇసుక తవ్వకాలతో భవిష్యత్‌లో కోతకు గురయ్యే అవకాశం ఉన్న రక్షణ గోడ ఇది. 2012–13 సంవత్సరంలో సుమారు రూ.4 కోట్ల నిర్మాణంతో రెండు పార్టులుగా ఈ రక్షణ గోడను రోడ్లు భవనాల శాఖ నిర్మించింది. వంశధార వరదల సమయంలో సీఎస్పీ రోడ్డు కోతకు గురవ్వడంతో పాటు పొలాలు, ఆరంగిపేట, వమరవల్లి వంటి ప్రాంతాలకు వెళ్లకుండా గోడ నిర్మించారు. ఇప్పుడీ తవ్వకాలతో రక్షణ గోడకు ముప్పు వాటిల్లనుంది.
తవ్వకాలకు 100 మీటర్ల దూరంలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ ఇది. రోజుకి లక్ష లీటర్లు నీరు అందించే ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇది. దీనికి కూడా ముప్పు వాటిల్లే విధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.
ఓ ప్రైవేటు కంపెనీ కోసం వంశధార నదిలో నిర్మించి ఇన్ ఫిల్టరేషన్ బావి ఇది. కొన్ని అడుగుల దూరంలోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment