పరిష్కరించినవి : 1070
పెండింగ్‌లో ఉన్నవి 30,489
● ఆర్భాటానికే పరిమితమైన కూటమి ప్రభుత్వం
● గ్రామసభలు, రెవెన్యూ సదస్సులకు వచ్చే అర్జీలకు కలగని మోక్షం
● అక్టోబర్‌లో పెద్ద ఎత్తున గ్రామసభల నిర్వహణ
● డిసెంబర్‌లో రెవెన్యూ సదస్సులు
● అర్జీల స్వీకరణలో గందరగోళం
● పరిష్కారంలో
తీవ్ర జాప్యం
అక్టోబర్‌లో గ్రామసభలు పెట్టి సమస్యలు చెప్పాలని కోరారు.. డిసెంబర్‌లో రెవెన్యూ సదస్సులు పెట్టి మళ్లీ సమస్యలు ఉంటే విన్నవించాలన్నారు.. ఇవి కాక మీకోసం అంటూ ప్రతి వారం అధికారుల వద్ద ఫిర్యాదులు చేసుకోవచ్చని చెప్పారు. జనం సమస్యలు చెబుతూనే ఉన్నారు. కానీ వాటికి పరిష్కారమే ప్రభుత్వం సూచించలేకపోతోంది. పేర్లు మార్చి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఫిర్యాదులు స్వీకరిస్తున్న కూటమి ప్రభుత్వం.. ఆనక ఆ అర్జీలకు న్యాయం చేయలేకపోతోంది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
కూటమి ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌లో రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమని పెద్ద ఎత్తున గ్రామసభలు నిర్వహించింది. ఎమ్మెల్యేలు సైతం హాజరై హడావుడి చేశారు. ఫక్తు రాజకీయ సభల్లా కార్యక్రమాలు నడిపారు. 735 గ్రామాల్లో సభల ద్వారా 30,514 అర్జీలను యంత్రాంగం సేకరించింది. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 16,711ఉండగా, సర్వే శాఖకు సంబంధించి 13,958 అర్జీలు ఉన్నాయి. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని అర్జీలివ్వగా వాటికి ఆన్‌లైన్ ఎంట్రీలోనే ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. 13,944 అర్జీలు ఎంట్రీ తర్వాత...ఆ ప్రక్రియను నిలిపేసి రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో గ్రామ సభల్లో వచ్చిన అర్జీలు ఎక్కడికక్కడ వదిలేసి అధికారులు రెవెన్యూ సదస్సులపై పడ్డారు. ఫలితంగా ఆన్‌లైన్ ఎంట్రీ జరగని మిగతా వాటి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కాకపోతే, మాన్యువల్‌గా గ్రామసభల్లో సేకరించిన 30,514 అర్జీల్లో 1808 అర్జీలు పరిష్కారమైనట్టు మాన్యువల్ నివేదికల్లో చూపించారు.
రె‘వెన్యూ’ మారిందంతే..
అక్టోబర్ గ్రామసభల గురించి మర్చిపోయిన తర్వాత ప్రభుత్వం డిసెంబర్ నెలలో మరో కార్యక్రమానికి తెరతీసింది. ఈసారి గ్రామ సభలు బదులు రెవెన్యూ సదస్సుల పేరుతో కార్యక్రమం చేపట్టింది. ఊరూరా సదస్సులు పెట్టి, కూటమి నాయకులతో హడావుడి చేసింది. గ్రామసభల్లో ఇచ్చిన అర్జీలకు అతీగతి లేకపోయినా...ఆ సభల్లో అర్జీలు ఇవ్వని వారు రెవెన్యూ సదస్సుల్లో అర్జీలు ఇచ్చారు. ఇక, గ్రామసభలు జరగని చోట జరిగిన రెవెన్యూ సదస్సుల్లో కూడా పెద్ద ఎత్తున అర్జీలు వచ్చాయి. డిసెంబర్6వ తేదీ నుంచి జనవరి 8 వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 31,559 అర్జీలు వచ్చాయి. వాటిలో 1070 మాత్రమే పరిష్కారమైనట్టు నివేదికల్లో చూపించారు. మిగతావన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. సమస్య తీవ్రత ఆధారంగా గడువు నిర్దేశించి పరిష్కారం చూపుతామని ప్రభుత్వం ప్రకటించింది. నిర్ణీత గడువుల్లో సమస్యలు పరిష్కారమైపోతాయని ప్రజలకు ఆశలు కల్పించారు. కానీ వేలల్లో అర్జీలు వస్తే.. వందల్లో పరిష్కారం చూపినట్టు నివేదికలు చెబుతున్నాయి.
సమస్యల ఏకరువు.. పరిష్కారం కరువు
రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమని తొలుత నిర్వహించిన గ్రామసభల్లో స్వీకరించిన 30,514 అర్జీల్లో కేవలం 13,944 అర్జీల డేటా మాత్రమే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ ప్రక్రియ చేస్తుండగానే వాటిని ఎక్కడికక్కడ వదిలేసి రెవెన్యూ సదస్సులపై దృష్టిసారించమని ప్రభుత్వం చెప్పింది. దీంతో రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన అర్జీలపై యంత్రాంగం దృష్టి సారించింది. ప్రభుత్వం పెట్టిన ఆప్షన్లు, కండిషన్లు, రకరకాల సూచనలతో సదస్సుల్లో వచ్చిన అర్జీలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికే సమయం తీసుకుంది. దీంతో వచ్చిన అర్జీల పరిష్కారానికి సమయమే లేకుండా పోయింది. దీనికి తోడు గ్రామసభల్లో వచ్చిన అర్జీల్లో సగానికిపైగా అప్‌లోడ్ చేయకుండా వదిలేసిన అర్జీలను రెవెన్యూ సదస్సుల సమయంలో అప్‌లోడ్ చేయాలని సర్కారు ఆదేశించింది. ఇది యంత్రాంగానికి కొత్త తలపోటు తెచ్చి పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment