● చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్న మహిళ
● పింఛన్‌కు కూడా నోచుకోని వైనం
కాశీబుగ్గ: కడదాకా తోడుంటానని ప్రమాణం చేసిన భర్త మధ్యలోనే చనిపోయారు. కుటుంబ బాధ్యతలన్నీ వచ్చి ఒక్కసారిగా నెత్తిన పడ్డాయి. ఇంటిలో పేదరికం వెక్కిరిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ మహిళ ధైర్యంగా నిలబడింది. కష్టపడి పనిచేస్తూ బతుకును ‘చెప్పు’చేతల్లోకి తెచ్చుకుంది. చెప్పులు కుట్టే వృత్తిని ఎంచుకుని కుటుంబానికి ఓ దారి చూపించింది. కన్నీళ్ల నుంచి బయటపడినా కష్టాలు మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. బతుకు వెతుక్కుంటూ ఒడిశా దాటి ఆంధ్రాకు వచ్చిన ఆ మహిళ కాసింత చేయూతను కోరుతున్నారు.
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 20వ వార్డు లేబరు కాలనీలో ఓ చిన్నపాటి అద్దె ఇంట్లో గురివారి దాస్ అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఈమె పలాస ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న కల్వర్టు పక్కన చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్నారు. సాధారణంగా ఈ వృత్తిలో అంతా మగవారే ఉంటారు. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె ఈ వృత్తిని ఎంచుకున్నారు. వాస్తవానికి ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బరంపురానికి సమీపంలో మారుమూల గ్రామంలో ఉండేవారు. భర్త లక్ష్మణదాస్ చెప్పులు కుట్టుకునే వృత్తిలో ఉండేవారు. అనారోగ్యంతో ఆయన మరణించారు. అప్పటి నుంచి ఇద్దరు చిన్నపిల్లలను పెంచుకుంటూ వస్తున్నారు. తన చిన్నతనంలో తన తండ్రి సైతం చెప్పులు కుట్టుకు ని కుటుంబాన్ని పోషించారని, భర్త కూడా అదే పనిచేశారని అందుకే అదే వృత్తిని ఎంచుకున్నాన ని చెబుతున్నారు. ఆమె ఇద్దరు కుమారులలో సునీల్ దాస్ ఒడిశాలో స్థిరపడ్డాడు. చిన్న కుమారుడు బబుల్‌దాస్ పలాసలో జీడి పరిశ్రమలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
పింఛన్ ఇప్పించండి సార్
ఒడిశా నుంచి మేం వచ్చేశాం. ఇక్కడ ఎలాంటి ఆధారం లేదు. ఇక్కడకు వచ్చి ఐదేళ్లు దాటిపోయింది. గత ప్రభుత్వంలో ఫించన్ వచ్చే సమయానికి ఒడిశా రేషన్ కార్డులో పేరు ఉండటంతో రాలేదు. ఇప్పుడు అన్నీ అక్కడి డిలేట్ చేసేశాం. ఇక్కడే స్థిరపడిపోయాం. ప్రభుత్వం రేషన్ కార్డు ఇప్పించి పింఛన్ అందిస్తే సహాయంగా ఉంటుంది. – గురివారి దాస్,
లేబరుకాలని, పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ
Comments
Please login to add a commentAdd a comment