అన్ని వర్గాల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాల సంక్షేమానికి కృషి

Published Thu, Dec 28 2023 1:26 AM | Last Updated on Thu, Dec 28 2023 1:26 AM

ట్రాక్టర్‌లు, పనిముట్లను పంపిణీ చేస్తున్న సీఎం స్టాలిన్‌  - Sakshi

అందరికీ అన్ని దక్కాలనే లక్ష్యంతోనే తాను నిత్యం శ్రమిస్తున్నానని సీఎం ఎంకే స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. సమ సమాజంగా తమిళనాడును తీర్చిదిద్దేందుకు ఆలస్యం చేయకుండా జాగృతి యాత్రను కొనసాగిద్దామని పిలుపు నిచ్చారు. ఆది ద్రావిడర్‌, గిరిజన సామాజిక వర్గం సంక్షేమానికి పెద్ద పీట వేసే విధంగా కొత్త పథకాలపై దృష్టి పెట్టామని ఆయన బుధవారం ప్రకటించారు.

సాక్షి, చైన్నె : ఆది ద్రావిడర్‌, గిరిజన సంక్షేమ శాఖ(ఎస్సీ, ఎస్టీ), సూక్ష్మ, చిన్న,మధ్య తరహా పరిశ్రమల శాఖల నేతృత్వంలో బుధవారం కలైవానర్‌ అరంగం వేదికగా భారీ వేడుక జరిగింది. ఇందులో తిరువల్లూరు, చెంగల్పట్టు, తిరువళ్లూరు, విరుదునగర్‌, తిరుపత్తూరు, కాంచీపురం, ధర్మపురి, శివగంగై, కృష్ణగిరి, తంజావూరు, కళ్లకురిచ్చి, తిరుప్పూర్‌, ఈరోడ్‌, మదురై, తెన్‌కాశి, రామనాథపురం జిల్లాల్లో రూ. 32.95 కోట్లతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం నిర్మించిన పాఠశాలలు, రూ.138 కోట్లతో నిర్మించిన హాస్టళ్లు, కమ్యూనిటీ వెల్పేర్‌ సెంటర్లను సీఎం స్టాలిన్‌ ప్రారంభించారు. అలాగే రాష్ట్రంలోని 16 జిల్లాలో ఆది ద్రవిడ, గిరిజన కళాశాలలలో రూ. 10 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో హాస్టళ్లు, 22 లెర్నింగ్‌ టీచింగ్‌ రూమ్‌ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అలాగే, భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పేరిట ఎంటర్‌ప్రెన్యూర్‌ షిప్‌ పథకం అమలు చేస్తూ రూ.79.53 కోట్లను 244 మంది లబ్ధిదారులకు అందజేశారు. అలాగే రూ. 53.94 కోట్ల బ్యాంక్‌ రుణాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 3 ట్రైబ్స్‌ ఎంటర్‌ ప్రెన్యూనర్‌, 3 ఆది ద్రవిడ పరిశ్రమలలో ఈక్విటీ పెట్టుడిని రూ. 6.50 కోట్లకు అంగీకరిస్తూ ఉత్తర్వులను అందజేశారు. తమిళనాడు పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ బోర్డు సభ్యులకు రూ. 55 కోట్లతో నిర్మించిన 500 గృహాలను లబ్ధిదారులకు సీఎం కేటాయించారు. కాంచీపురం జిల్లా ఉత్తర మేరూరు, వాలాజా బాద్‌, శ్రీపెరంబదూరు తాలుకాలలోని గిరిజన కుటుంబాలకు రూ. 22.80కోట్లతో నిర్మించిన 443 గృహాలను లబ్ధిదారులకు అందజేశారు. ఆదిద్రావిడ, గిరిజన సామాజిక ఆర్థిక ఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాల్లో భాగంగా 225 మంది లబ్ధిదారుల ప్రయోజనార్థం రూ.16.76 కోట్లతో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. గిరిజన జీవనోపాధి పథకం విస్తృతంతో పాటు వ్యవసాయ ఆధారిత పరికరాలు, సౌరశక్తితో పనిచేసే మిల్లింగ్‌ యంత్రాలను లబ్ధిదారుకు పంపిణీ చేశారు. కారుణ్య నియామకాల కింద 50 మంది ఉద్యోగుల వారసులకు జూనియర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులను నియామక ఉత్తర్వులను సీఎం అందించారు. ప్రభుత్వ న్యాయ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 1000 మందికి స్కాలర్‌ షిప్‌లను, విదేశాలలోని అగ్ర శ్రేణి విశ్వ విద్యాలయాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌ షిప్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.

సమ సమాజంగా తమిళనాడు

న్యూస్‌రీల్‌

తమిళనాడు నంబర్‌–1

కావాలన్నదే లక్ష్యం

ఆలస్యం వద్దు

జాగృతి యాత్రను కొనసాగిద్దాం

సీఎం స్టాలిన్‌ పిలుపు

ఆదిద్రావిడర్‌, గిరిజన సంక్షేమానికి పెద్దపీట

ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్‌ ప్రసంగిస్తూ, సామాజిక న్యాయం, సమానత్వం, సమధర్మం, సౌభ్రాతృత్వం, మానవత్వం అందరికీ అన్ని లక్ష్యంగా దివంగత నేతలు పెరియార్‌, అన్నా, కరుణానిధి చూపిన మార్గంలో ద్రవిడ మోడల్‌ పాలనతో తాను శ్రమిస్తున్నానని వివరించారు. ఆదిద్రావిడ, గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు సామాజిక, విద్యా, ఆర్థికపరంగా పెంపునకు ప్రత్యేక శ్రద్ధను కనవబరుస్తూ పథకాలను రూపొందిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ జయంతి రోజును రాష్ట్రలో సమానత్వ దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేస్తూ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం కోసం శ్రమించే స్వచ్ఛంద సేవకులకు బంగారు పతకం రూ. 5 లక్షలు నగదుతో అంబేడ్కర్‌ అవార్డును ప్రదానం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఈ సామాజిక వర్గం ప్రజలకు గత మూడేళ్లలో తమ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలను సీఎం వివరించారు. ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం, అధికారంలో పాత్ర వంటి స్థాయిలో ఈ సామాజిక వర్గాన్ని బలోపేతం చేస్తూ , ఈ ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. నిరంతరం ఈ పని కొనసాగుతుందని, సమ సమాజాన్ని సృష్టించడం, ఆర్థిక కేటయింపులు, భవిష్యత్తు కార్యాచరణ, సామాజిక అభివృద్ధి, ప్రజల ఆలోచనలలో మార్పుల దిశగా ముందుకెళ్తామన్నారు. ఈ పయనం అంత త్వరగా సాధ్యం కాదనే విషయాన్ని గుర్తు చేస్తూ, అంబేడ్కర్‌ కలలుగన్న స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం ఆధారంగా తమిళనాడును సమ సమాజంగా తీర్చిదిద్దే విధంగా ఆలస్యం చేయకుండా జాగృతి యాత్రను కొనసాగిద్దామని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కయల్‌ వెలి సెల్వరాజ్‌, కేఎన్‌ నెహ్రూ, శేఖర్‌బాబు, సీవీ గణేషన్‌, అన్బరసన్‌, సీఎస్‌ శివదాస్‌ మీన, మేయర్‌ ప్రియ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
లబ్ధిదారులకు చెక్‌ను అందజేస్తూ.. 1
1/2

లబ్ధిదారులకు చెక్‌ను అందజేస్తూ..

2
2/2

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement