తండ్రి హత్య కేసులో కొడుకు అరెస్టు | Sakshi
Sakshi News home page

తండ్రి హత్య కేసులో కొడుకు అరెస్టు

Published Wed, May 22 2024 9:25 AM

-

తిరువళ్లూరు: తల్లిని తన కళ్లెదుటే చితకబాదుతున్న తండ్రిని కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసిన కొడుకును వెళ్లవేడు పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరు జిల్లా తిరుమళిసై బజారువీధికి చెందిన బాబు(49) ప్రైవేటు కంపెనీలో కార్పెంటర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య దేవి(42)తో పాటు కొడుకు తమిళరసన్‌, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. ప్రస్తుతం బాబు తన భార్య, కొడుకుతో కలిసి నివాసం ఉంటున్నారు. తమిళసరన్‌ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. తరచూ మద్యం సేవించే బాబు భార్య దేవితో ఘర్షణ పడేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 11 గంటలకు మద్యం సేవించి ఇంటికి వచ్చిన బాబు భార్యతో ఘర్షణ పడడంతోపాటు చితకబాదినట్టు తెలుస్తుంది. తన కళ్లెదుటే తల్లిని తండ్రి చితకబాదడం చూసి, ఆగ్రహించిన తమిళరసన్‌ తన తండ్రితో వాగ్వాదానికి దిగాడు. తల్లిని కొట్టవద్దని హెచ్చరించాడు. అయి నా బాబు వినకపోగా దేవిపై మరింత రెచ్చి పోవడంతో ఆగ్రహించిన తమిళరసన్‌ తన తండ్రి బాబును కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు వెళ్లవేడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన తమిళరసన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement