ఆ టైంలో చాలా కష్టపడ్డా!
తమిళసినిమా: ప్రముఖ నటుడు కమలహాసన్ వారసురాలు శ్రుతిహాసన్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈమె కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. అదేవిధంగా కథానాయకిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న శ్రుతిహాసన్ కథానాయకిగా లక్ అనే హిందీ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. అయితే ఆ చిత్రం ఆమె సినీ జీవితానికి ఎలాంటి లక్కూ ఇవ్వలేదు. ఆ తర్వాత తెలుగులో అనగనగా ఒక ధీరుడు అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం కూడా నిరాశనే కలిగించింది. ఆ తర్వాత మాతృభాష తమిళంలో 7ఆమ్ ఐరివు చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యారు. సూర్య కథానాయకుడిగా నటించిన ఆ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం బాగానే ఆడింది. ఆ తర్వాత ధనుష్ సరసన 3 చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. వైవిద్య భరిత ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ లభించలేదు. అయితే అందులోని వై దిస్ కొలైవెరి డీ అనే పాట మాత్రం దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. అంతేకాకుండా ధనుష్ శ్రుతిహాసన్ మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని పేరు వచ్చింది. అయితే ఆ తర్వాత శ్రుతిహాసన్‌కు అవకాశాలు రాలేదట. దీని గురించి ఆమె ఇటీవల ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంటూ 3 చిత్రం తర్వాత రెండేళ్లు అవకాశాలు లేక ఖాళీగా ఉన్నానని, ఆ సమయంలో చాలా కష్టపడ్డానని చెప్పారు. అయితే అదే చిత్రం 10 తర్వాత రీ రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించిందని, ఆ విజయం ఏదో మొదట్లోనే సాధిస్తే బాగుండేదని అభిప్రాయాన్ని శ్రుతి వ్యక్తం చేశారు. అయినప్పటికీ తనకు తమిళ చిత్రాల్లో నటించడం ఇష్టమన్నారు.. ఇప్పుడు కూడా ఒక తమిళ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. ఈమె ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ చిత్రంలో నటిస్తున్నారు. అయితే శ్రుతిహాసన్ హిందీ, తమిళ భాషలో కంటే తెలుగులోనే పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment