మాది ప్రజల ప్రభుత్వం
● ప్రజల జీవితాల సుసంపన్నం లక్ష్యం ● సంపన్న తమిళనాడు దిశగా కార్యాచరణ ● అరియలూరు, పెరంబలూరు ప్రగతికి కొత్త ప్రాజెక్టులు ● క్షేత్ర స్థాయి పర్యటనలో సీఎం స్టాలిన్ ● 15 వేల మందికి ఉపాధి కల్పనకు కార్యాచరణ
సాక్షి, చైన్నె: ప్రజల జీవితాలను సుసంపన్నం చేయడమే ద్రావిడ మోడల్ పాలన అని, తమది ప్రజల ప్రభుత్వం అంటూ సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. వెనుక బడిన జిల్లాలైన అరియలూరు, పెరంబలూరు ప్రగతికి కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా శుక్రవారం ఆ జిల్లాలో విస్తృతంగా సీఎం పర్యటించారు.
సీఎం ఎంకే స్టాలిన్ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా మూడో విడతగా అరియలూరు, పెరంబలూరు జిల్లాలపై దృష్టి పెట్టారు. అరియలూరులో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో అరియలూరు, పెరంబలూరు జిల్లాల్లో 507 పనులను సీఎం ప్రారంభించారు. 53 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించారు. కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అరియలూరులో 10,141, పెరంబలూరులో 11,721 మంది లబ్ధిదారులకు వివిధ సంక్షేమ పథకాలను అందజేశారు. అరియలూరులో రూ.1000కోట్లతో అతిపెద్ద విదేశీ పాదరక్షల సంస్థ డీన్ షూగ్రూప్ పరిశ్రమ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు.
ఇది మన ప్రభుత్వం
ప్రారంభోత్సవాలు, లబ్ధిదారులకు సంక్షేమ పథకాల పంపిణీ, కొత్త పనులకు శంకుస్థాపన ముగిసిన అనంతరం సీఎం స్టాలిన్ ప్రజలను ఉద్దేశించి సభలో ప్రసంగించారు. అరియలూరు, పెరంబలూరు సమగ్ర ప్రగతి లక్ష్యంగా ప్రభుత్వం కొత్త పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతం చేసినట్టు వివరించారు. ఈ జిల్లాకు చెందిన రవాణాశాఖా మంత్రి శివశంకర్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. అరియలూరు, పెరంబలూరు జిల్లా విశిష్టతను గుర్తు చేస్తూ, ఇక్కడి గంగై కొండ చోళపురంలో మామన్నన్ రాజేంద్ర చోళుడి కీర్తిని చాటే మ్యూజియం, జయం కొండంలో పాద రక్షల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేశానని తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా 15 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని ప్రకటించారు. జయంకొండం ప్రభుత్వ ఆస్పత్రిని జిల్లా కేంద్రం ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయనున్నామని, కున్నంలో, బాదలూరులో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు రూ.345 కోట్లను కేటాయించామని వివరించారు. పెరంబలూరులో ఇక్కడి రైతుల ప్రయోజనార్థం ఉల్లి విక్రయ కేంద్రం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అద్దె భవనంలో ఉన్న పెరబలూరు ప్రభుత్వ మోడల్ హయ్యర్ సెకండరీ స్కూల్‌కు రూ.56 కోట్లతో పక్కా భవనం నిర్మించనున్నామని, ఎంపీ తిరుమావళవన్ విజ్ఞప్తి మేరకు అరియలూరులో న్యాయస్థానాలన్నీ ఒకే చోట ఉండేలా కోర్టు కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ప్రాజెక్టులను ప్రకటిస్తున్నామని, ఇది మన ప్రభుత్వం అని, ద్రావిడ మోడల్ ప్రజా ప్రభుత్వం అని వ్యాఖ్యలు చేశారు.
పళణిలో వణుకు ..
ప్రజల కోసం జాగ్రత్తగా కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తూ, వాటి తీరు తెన్నులపై స్వయంగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నానని వివరించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. నన్ను చూసి ఓర్వ లేక ప్రతి పక్ష నేత పళణిస్వామి వణికి పోతున్నారని ఎద్దేవా చేశారు. జయలలిత అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పథకాలు తీసుకొచ్చారని, అయితే, ఆమె మరణించినానంతరం నాలుగేళ్లు అధికారంలో ఉన్న పళణిస్వామి తమిళనాడు లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినట్టుగా అబద్ధపు సమాచారం ఇస్తున్నారని ధ్వజమెత్తారు. వీరి అవినీతి, కమీషన్ , కలెక్షన్ కారణంగా అనేక మంది పెట్టుబడిదారులు, పరిశ్రమల యజమానులు తమిళనాడు నుంచి ఇతర ప్రాంతాలకు పారిపోయే పరిస్థితి ఉండేదన్నారు. తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం పరిశ్రమలకు పునరుజ్జీవం పోసినట్టు ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడును భారతదేశంలోనే ప్రధాన రాష్ట్రంగా మార్చడానికి అహర్నిషలు కృషి చేస్తున్నామన్నారు. మూడేళ్ల పాలనలో ఆర్థిక సంక్షోభం ఎదురైనా, ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగామని, భవిష్యత్తులో సంపన్న తమిళనాడు లక్ష్యంగా ప్రణాళికతో అడుగులు వేస్తున్నామన్నారు. మంత్రులు ఏవీ వేలు, కేఎన్ నెహ్రూ, ఎంఆర్‌కే పన్నీరుసెల్వం, గీతాజీవన్, శివశంకర్, కోవి చెలియన్, సీవీ గణేషన్, టీఆర్‌బీ రాజా, ఎంపి. తిరుమావళవన్, ఏ.రాజా పాల్గొన్నారు.
పోషకాహార లోపం పిల్లల కోసం..
అరియలూరులో వారణాసిలో పోషకాహార లోపంతో జన్మించే పిల్లల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. మదురైలో తొలిసారిగా గతంలో కేంద్రం ఏర్పాటు చేశారు. మలి విడతగా అరియలూరులో ఏర్పాటు చేశారు. పౌష్టికాహారాన్ని పిల్లలకు సీఎం అందజేశారు. పిల్లల తల్లులకు పౌష్టికాహార
సంబంధిత వస్తువులతో కూడిన కిట్లను
అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment