పథకం ప్రకారం ట్రోల్ చేస్తున్నారు!
తమిళసినిమా: సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కంగువ. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నాయకిగా, హిందీ స్టార్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఇ. జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్లో నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈనెల 14న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో భారీ అంచనాల మధ్య విడుదలైంది. చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. అయితే కంగువ చిత్రం ఎదుర్కొంటున్న వ్యతిరేక విమర్శలపై నటి జ్యోతిక స్పందించారు. ఆమె తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొంటూ ‘‘కంగువ చాలా మంచి చిత్రం. ఈ విషయాన్ని నేను సూర్య భార్యగా కాకుండా సినిమా అభిమానిగా చెబుతున్నాను. ఒక నటుడిగా సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్న సూర్య తపనను చూసి గర్వపడుతున్నాను. భారతీయ సినిమాలో తప్పులు అన్నవి ఒక భాగం మాత్రమే. మూడు గంటల చిత్రంలో అర్ధగంట మాత్రమే కొరత ఉంది. ఈ చిత్రంలో శబ్ద బీభత్సం ఉందన్నది నేను ఒప్పుకుంటున్నాను. అయితే కంగువ పూర్తిగా మంచి అనుభవాన్ని కలిగించే చిత్రం. మహిళలను కించపరచడం ద్వందర్ధాల సంభాషణలు వంటివి లేకుండా భారీ బడ్జెట్లో రూపొందించిన ఈ చిత్రానికి తగ్గట్టుగా సద్విమర్శలు అసలు రాలేదు. ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వ్యతిరేక విమర్శలు మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కంగువలో మంచి యాక్షన్ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. చిత్ర రెండవ భాగంలో మహిళల యాక్షన్ సన్నివేశాలు, కంగువాకు చిన్నపిల్లవాడికి మధ్య ప్రేమ, ద్రోహం వంటి మంచి సన్నివేశాలు ఉన్నాయి. చిత్రాన్ని రివ్యూ చేసిన వారు మంచి విషయాలను చెప్పడం మరిచారు. దీన్ని 3 డీ ఫార్మెట్‌లో రూపొందించిన చిత్ర యూనిట్‌ను అభినందించకపోగా, థియేటర్లో తొలి ప్రదర్శన పూర్తికాకుండానే కంగువ చిత్రానికి అంతగా వ్యతిరేక విమర్శలు రావడం బాధాకరం. కంగువ చిత్ర యూనిట్ గర్వంగా ఉండండి. వ్యతిరేక విమర్శలు చేస్తున్నవారే చిత్రాన్ని మరో లెవల్ కు తీసుకెల్లడం మినహా మరేమీ చేయలేరు’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment