క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Published Wed, Nov 20 2024 12:43 AM | Last Updated on Wed, Nov 20 2024 12:42 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

బాలికపై లైంగిక దాడి

ఇద్దరు ట్యాక్సీ డ్రైవర్లు అరెస్ట్‌

అన్నానగర్‌: చైన్నె సమీపంలోని నందంబాక్కంలో తల్లిదండ్రులను కోల్పోయిన 17 ఏళ్ల యువతి తన మేనత్త ఇంట్లో పెరుగుతోంది. అత్త మందలించిందని ఆగ్రహించిన బాలిక 8వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయింది. తిరిగి రాకపోవడంతో ఈ విషయమై ఆమె అత్త నందంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ స్థితిలో 15వ తేదీన బాలిక పమ్మల్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను రక్షించి, బంధువులకు అప్పగించారు. పోలీసులు బాలికను విచారించగా దిగ్భ్రాంతికరమైన సమాచారం వెల్లడైంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత రోడ్డు పక్కన నిలబడి ఉన్న కడలూరు జిల్లా పులియాంగుడికి చెందిన ట్యాక్సీ డ్రైవర్‌ భాగ్యరాజ్‌(38 ) సహాయం కోరింది. ఉద్యోగం ఇప్పిస్తానని భాగ్యరాజ్‌ తన స్నేహితుడు పరమశివన్‌(40)కి ఫోన్‌ చేశాడు. ఉద్యోగం ఇప్పించకుండా కారులో పెట్టుకుని ఇద్దరూ కలిసి బాలికపై అత్యాచారం చేసినట్లు తెలిసింది. అనంతరం ఆ బాలికను పమ్మల్‌లో వదిలేశారు. అనంతరం బాలికపై అత్యాచారానికి పాల్పడిన భాగ్యరాజ్‌, పరమశివన్‌లను మంగళవారం పోలీసులు ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచి, జైలుకు తరలించారు.

సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

తిరువళ్లూరు: పట్టణంలోని పార్క్‌ను ధ్వంసం చేసి వ్యాపార దుకాణాలను నిర్మించాలన్న మున్సిపాలిటీ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఽమంగళవారం ధర్నా నిర్వహించారు. తిరువళ్లూరు పట్టణంలో రాజమ్మాళ్‌దేవి పార్క్‌ వుంది. ఈ పార్క్‌ను సుమారు వందేళ్ల క్రితం నిర్మించారు. అప్పటి నుంచి చిన్నారులకు ఆటస్థలంగా, వృద్ధులు, యువకులకు వాకింగ్‌ పాత్‌గా ఉపయోగపడుతోంది. ఈ క్రమంలో పార్క్‌ను తొలగించేసిన మున్సిపాలిటీ అధికారులు 21 వ్యాపార దుకాణాలను రూ.90 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. దుకాణాలు పూర్తయితే మున్సిపాలిటీకి నెలకు సుమారు మూడులక్షల రూపాయల మేరకు ఆదాయం వచ్చే అవకాశఽం ఉంది. అయితే పార్క్‌ను తొలగించేసి దుకాణాలు నిర్మించడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లా కన్వీనర్‌ గోపాల్‌ అధ్యక్షత వహించాడు. రాష్ట్ర కమిటీ సభ్యుడు సుందరరాజన్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పార్క్‌ను యఽథావిధిగా కొనసాగించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో డివిజన్‌ కార్యదర్శి కలైయరసన్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు తమిళరసు, ఎయిళరసన్‌, మురుగన్‌, ఉదయనిల, నల్లరాసు తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సాగు భూముల సేకరణపై వ్యతిరేకత

కొరుక్కుపేట: చైన్నె మహానగరాభివృద్ధి కోసం వ్యవసాయ భూముల సేకరణపై స్థానిక రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. తాంబరం పక్కనే ఉన్న తెన్పడువంచేరి, మేడంబాక్కం, నుంతనంజచేరి తదితర ప్రాంతాల్లోని 600 ఎకరాల వ్యవసాయ భూమిని చైన్నె మహానగరాభివృద్ధి సంస్థ స్వాధీనం చేసుకుంది. ఇళ్ల స్థలాలు, పార్కులు, రోడ్లుగా అభివృద్ధి చేయనుందని చెబుతున్నారు. దీన్ని ఆ ప్రాంత రైతులు, సామాన్య ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితిలో మంగళవారం వ్యవసాయ భూముల సేకరణకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే తరఫున ప్రదర్శన ఉంటుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. దీని ప్రకారం తాంబరంలో సౌత్‌, చెంగల్పట్టు పశ్చిమ జిల్లా ఏడీఎంకే జిల్లా కార్యదర్శి చిట్లపాక్కం రాజేంద్రన్‌ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇందులో అన్నాడీఎంకే మాజీ మంత్రి టీకేంఎం చిన్నయ్య, మాజీ ఎంపీపీ రామచంద్ర, తాంబరం కార్పొరేషన్‌ ప్రతిపక్ష నాయకుడు సెలయూరు శంకర్‌, పార్లమెంట్‌ సభ్యుడు వాటర్‌ రాజ్‌తోపాటు రైతులు సహా వెయ్యి మంది నిరసనలో పాల్గొన్నారు. నిరసన ప్రదర్శనలో వ్యవసాయ భూముల సేకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సమావేశానికి వస్తే.. కుర్చీ ఫ్రీ

తిరుపూర్‌ అన్నాడీఎంకే నేత ప్రకటన

సేలం: తిరుపూర్‌ పెరుమానల్లూర్‌లో నగర జిల్లా ఎంజీఆర్‌ యువజన విభాగం కార్యదర్శి వేల్‌కుమార్‌ స్వామినాథన్‌ అన్నాడీఎంకే 53వ వార్షిక ఉత్సవాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సమావేశంలో సంక్షేమ పథకాలను అందజేస్తారని ప్రకటించారు. ఆ మాటలు నమ్మి పెద్ద సంఖ్యలో జనం పోగయ్యారు. మైదానం అంతా కొత్త కుర్చీలను ఏర్పాటు చేశారు. అయితే సమావేశం స్టేజ్‌ సమీపంలో ప్రజలకు ఇవ్వడానికి వస్తువులు ఏవీ కనిపించలేదని తెలుస్తోంది. అక్కడ సమావేశానికి వచ్చిన వారంతా కుర్చీలపై కూర్చున్నారు. సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్‌ విజయకుమార్‌, పొల్లాచ్చి జయరామన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అకస్మాత్తుగా స్టేజీ పైకి ఎక్కిన వేల్‌ కుమార్‌ మైక్‌లో సమావేశానికి వచ్చిన వారంతా సమావేశం ముగిసిన తరువాత వారు కూర్చుని ఉన్న కుర్చీలను వాళ్లే తీసుకువెళ్లవచ్చని ప్రకటించారు. దీంతో బయట నిల్చుని ఉన్న వారంతా కూడా అక్కడి వచ్చి కుర్చీలలో కూర్చుని, సమావేశం తర్వాత ఆ కుర్చీలను తీసుకుపోవడం కలకలం రేపింది. వేల్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఒక కుర్చీ ధర రూ.350 అని, దానిని కంపెనీ నుంచి రూ.280 లెక్కన 2000 కుర్చీలను కొనుగోలు చేసినట్టు తెలిపారు. తనకు రూ.5 లక్షల 60 వేల ఖర్చు అయినట్టు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement