ఏనుగు దంతాల కేసులో 9 మంది అరెస్ట్
వేలూరు: అరియూరు మలైకోడి గ్రామానికి చెందిన సంపత్ ఇంటిలో ఏనుగు దంతాలతోపాటు ఇతర వస్తువులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు సంపత్ ఇంటిలో సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఇంటిలో దాచి ఉంచిన ఏనుగు దంతాలు నాలుగు ముక్కలు, ఒక దంతం ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. సంపత్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. విచారణలో ఏనుగు దంతాలు దాచి ఉంచిన కేసులో పలువురికి సంబంధం ఉన్నట్లు తెలియ వచ్చింది. సంపత్ తెలిపిన సమాచారం ప్రకారం అరియూరు సమీపంలోని ఏజీనగర్‌కు చెందిన శరత్‌కుమార్, తిరువణ్ణామలై జిల్లా నిమ్మయంబట్టు సమీపంలోని కీల్ కోయలూరుకు చెందిన కుమార్, తూత్తుకుడి జిల్లా మేల్ ఆతూరుకు చెందిన ధనపాల్, వేలూరు సత్‌వచ్చారికి చెందిన ధరణికుమార్, చిన్న అల్లాపురానికి చెందిన పయణి, ఆనీస్, అనకట్టుకు చెందిన రవి, అరియూరు కుప్పంకు చెందిన మణిగండన్‌లు కలిసి ఈ ఏనుగు దంతాలు దాచి ఉంచినట్లు తెలియవచ్చింది. దీంతో ఈ తొమ్మిది మందిని అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేసి వారి వద్ద విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా చైన్నె, రామనాథపురానికి చెందిన ప్రత్యేక విచారణ బృందం సోమవారం రాత్రి వేలూరుకు వచ్చి పట్టుబడిన వారిని రహస్య ప్రాంతంలో పెట్టి విచారణ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment