మోతపై.. వాత!
● బస్సుల్లో ఇకపై లగేజీ చార్జీ తప్పనిసరి
● నగర రవాణా సంస్థ నిర్ణయం
● ట్రాలీ, సూట్ కేస్, పెద్ద బ్యాగ్‌లకు టికెట్లు
సాక్షి, చైన్నె: చైన్నె నగర రవాణా సంస్థ బస్సులలో ఇకపై లగేజీ చార్జీ తప్పనిసరి కానుంది. పెద్ద ట్రాలీ, సూట్ కేసు, బ్యాగ్‌లతో ప్రయాణించే వారికి లగేజీ చార్జీగా ఆ వ్యక్తి ప్రయాణానికి అయ్యే టికెట్టు ధరను నిర్ణయించి వసూలు చేయడానికి చర్యలు చేపట్టారు. ఈ మేరకు మార్గ దర్శకాలను నగర రవాణా సంస్థ(ఎంటీసీ) ప్రకటించింది. వివరాలు.. చైన్నె నగరంలో 625 మార్గాలలో 3 వేల మేరకు ఎంటీసీ బస్సులు సేవలు అందిస్తున్నాయి. రోజుకు ఈ బస్సులలో 30 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఈ మార్గాలలో బస్సుల సేవలు, ప్రయాణికులకు ఎదురు అవుతున్న సమస్యలు, బస్సులలో లగేజీ కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు వంటి అంశాలపై అధికారులు అభిప్రాయాలు సేకరించారు. ఇందులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా లగేజీ చార్జీ వసూలుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎంటీసీ బస్సులలో 20 కేజీలలోపు బరువు కలిగిన వస్తువులను తీసుకెళ్లేవారికి ఎలాంటి లగేజీ చార్జీ వసూలు చేయడం లేదు. అయితే, పార్శిల్ పెద్దదిగా ఉంటే చాలు కండెక్లర్లు లగేజీ చార్జ్ అంటూ టికెట్లు కొట్టే స్తున్నారు. దీంతో ప్రయాణికుడికి, కండెక్టర్‌కు మధ్య అనేక సందర్భాలలో గొడవలు జరుగుతూ వస్తున్నాయి. వీటన్నింటికీ ముగింపు పలికే విధంగా చార్జీల వసూళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటించారు.
పెద్ద వాటికే..
నగర రవాణా సంస్థ బస్సులో ప్రయాణికులు 65 సెం.మీ పైగా ఉన్న ట్రాలీ, సూట్ కేసులు, బ్యాగ్‌లను లేదా, 20 కేజీలకు పైగా బరువు కలిగిన పార్సిళ్లను తీసుకెళ్లే వ్యక్తి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తారో, ఆ దూరం ఆధారంగా అతడి టికెట్టు చార్జీ మేరకు అదనంగా మరో టికెట్టు తీసుకునే విధంగా ఎంటీసీ బస్సులలోని కండెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. నగర రవాణా సంస్థలోని సాధారణ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, లగ్జరీ బస్సులలో ఈ అదనపు టికెట్టు చార్జీని లగేజీ చార్జీగా నిర్ణయిస్తూ చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులు సొంత ఉపయోగం కోసం భుజాన తగిలించుకునే బ్యాగ్, లేదా బట్టల సంచి ,హ్యాండ్ డ్యాగ్, చిన్న సూట్‌కేసు, కెమెరా బ్యాగ్, ల్యాప్ టాప్, చిన్న ఎలక్ట్రానిక్ వస్తువుల బ్యాగ్, దివ్యాంగుల వీల్ చైర్‌లను ఎలాంటి లగేజీ చెల్లించుకుండా బస్సులలో తీసుకెళ్లే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కళాకారులు తమ వాయిద్యాలను ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం చైన్నె కోయంబేడు నుంచి దక్షిణ తమిళనాడు వైపుగా వెళ్లే బస్సులను కిలాంబాక్కం బస్టాండ్‌కు మార్చేశారు. దీంతో నగర వాసులు చైన్నె శివారులో ఉన్న కిలాంబాక్కంకు తమ బ్యాగులు, ట్రాలీలలో ప్రయాణించేందుకు అవస్థలు పడుతున్నారు. దీంతో ఈ పెద్ద ట్రాలీ, బ్యాగ్‌లు, సూట్ కేసులకు లగేజీ నిర్ణయించడం గమనార్హం. అలాగే తోటి ప్రయాణికులకు ఇబ్బంది ఎదురయ్యే విధంగా ఉండే వస్తువులు, పార్సిళ్లను బస్సులలో అనుమతించ వద్దని స్పష్టం చేశారు. తపాల్, పత్రికల పార్సిళ్ల తరలింపునకు ముందస్తు అనుమతిని ఆయా సంస్థలు పొందే విధంగా సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment