క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Published Thu, Nov 21 2024 1:41 AM | Last Updated on Thu, Nov 21 2024 1:41 AM

-

విద్యుదాఘాతంతో

కార్మికుడి మృతి

పెళ్లి బ్యానర్‌ కట్టే సమయంలో ఘటన

సేలం : విరుదునగర్‌ జిల్లా రాజపాళయం సమీపంలో సేత్తూర్‌లో ఉన్న మేట్టుపట్టి వీధికి చెందిన మురుగన్‌ (40), ముత్తురాజన్‌ (50) శుభకార్యాలకు పందిళ్లు వేసే పని చేస్తున్నారు. వీరు సేత్తూర్‌ ఐందుకడై బజార్‌ ప్రాంతంలో వివాహ వేడుక కోసం మంగళవారం సాయంత్రం బ్యానర్‌ కడుతుండగా.. విద్యుదాఘాతానికి గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు వారిద్దరిని హుటాహుటిన రాజపాళయం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మురుగన్‌ మృతి చెందినట్టు తెలిపారు. విషమ స్థితిలో ముత్తురాజన్‌ చికిత్స పొందుతున్నాడు. సేత్తూర్‌ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

రోడ్డుపై పడిన నగలు

పోలీసులకు అందజేత

అన్నానగర్‌: చైన్నెలోని నోలంపూర్‌ ప్రాంతంలోని ఐశ్వర్యం క్వార్టర్స్‌కు చెందిన భాస్కర్‌ (42) ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. ఈనెల 16న భాస్కర్‌ తన బైకుపై నోలంపూర్‌ ప్రధాన రహదారిపై వెళ్తుండగా కిందపడి ఉన్న బంగారు నగలను గుర్తించాడు. అనంతరం ఆ నగలను నోలంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. అనంతరం నోలంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ శేఖరన్‌ నేతృత్వంలో పోలీసులు ఆ ప్రాంతంలోని 125 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నగలు తప్పిపోయిన వ్యక్తి కోసం వెతికారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి నగలు వదిలేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఆ వ్యక్తిని పిలిపించి విచారించగా.. ముగప్పర్‌ డీడీ రోడ్డులో నివసించే మహేశ్వరన్‌ (41) కోడంబాక్కంలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తేలింది. దీంతో పోలీసులు నెక్లెస్‌ను మహేశ్వరన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా భాస్కరన్‌ను పోలీసులు అభినందించారు.

8 నెలల గర్భవతిగా పాఠశాలకు వచ్చిన విద్యార్థిని

సేలం: కోవై సమీపంలో ఉన్న ప్రభుత్వ మహోన్నత పాఠశాలకు వచ్చి ప్లస్‌టూ చదువుతున్న విద్యార్థిని ఒకరు ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి గురించి టీచర్లకు తెలియడంతో విద్యార్థిని తల్లిదండ్రులను రప్పించి బెదిరించి గత 12వ తేది టీసీ ఇచ్చి పంపించారు. ఈ విషయం గురించి మహిళా పోలీసు స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కాగా ఎనిమిది నెలలు గర్భవతి అయిన విషయం టీచర్లకు ఎలా తెలియకుండా పోయిందని, అకస్మాత్తుగా టీసీ ఇచ్చి పంపించడం ఏమిటి, ఆమె గర్భానికి కారణం ఎవరు వంటి కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఉద్యోగం పేరుతో మోసం

ఎస్పీ కార్యాలయంలో బాధితుల ఫిర్యాదు

వేలూరు: ఆర్మీలో ఉద్యోగం తీసిస్తామని పలువురి వద్ద నగదు తీసుకుని మోసం చేస్తున్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితుడు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. బుధవారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మదివానన్‌ అధ్యక్షతన గ్రీవెన్స్‌సెల్‌ జరిగింది. సిందులో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వారు వేర్వేరు సమస్యలపై వినతి పత్రాలు సమర్పించుకున్నారు. ఇందులో పల్లిగొండ సమీపంలోని కుచ్చిపాల్యంకు చెందిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చైన్నె తాంబరంలో తన కుమారుడు చదువుతున్న సమయంలో అక్కడ ఒక వ్యక్తి తన కుమారుడికి పరిచయం అయ్యాడని, ఆ సమయంలో ఆర్మీలో చేర్పించేందుకు తనకు తెలిసిన వ్యక్తులు ఉన్నారని ఒకరికి రూ.2 లక్షలు కడితే చాలని వెంటనే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. నమ్మి తన కుమారుడితో పాటు మరో ఇద్దరు రూ.5 లక్షల నగదును అతనికి ఇచ్చారన్నారు. అనంతరం నకిలీ ఆర్టర్‌ కాపీని ఒకటి తమకు పంపాడని వీటిని తనకు తెలిసిన ఆర్మీ అధికారి వద్దకు తీసుకెళ్లి చూపించగా నకిలీవని తెలిసిందన్నారు. విచారణ జరిపి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

అర్ధరాత్రి పూజలపై ఆగ్రహం..

భార్యపై పెట్రోల్‌ పోసిన భర్త..

నిప్పు అంటుకుని నలుగురు ఆంధ్రులకు గాయాలు

సేలం : తిరువెరుంబూర్‌ సమీపంలో ఉన్న పూలాంగుడి పలంకానంగుడి సాలైలోని హ్యాపి నగర్‌కు చెందిన రైతు రాజేంద్ర ప్రసాద్‌ (56).. ఇతని భార్య హేమా బిందు (50). వీరికి గుణశేఖర్‌ (20), గురుసామి (20) అనే ఇద్దరు కుమారులు, హర్షిణి, ఉమాశంకరి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దురు కుమారులు ఇంజినీరింగ్‌ చదువుతుండగా హర్షిణి ప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్‌గా ఉంది. ఉమాశంకరి డాక్టర్‌కు చదువుతోంది. వీరితో పాటు రాజేంద్ర ప్రసాద్‌ తల్లి కూడా ఉన్నారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారు. కాగా హేమా బిందుకు ఆధ్యాత్మికంలో అధిక ఆసక్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పుడూ హేమా పూజ గదిలో కూర్చుని పూజలు చేస్తూ ఉంటారని, ఇది రాజేంద్ర ప్రసాద్‌కు అసలు నచ్చేది కాదని తెలుస్తోంది. ఈ స్థితిలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో హేమా బిందు పూజలు చేస్తూ ఉన్నట్టు తెలిసింది. దీంతో తీవ్ర కోపానికి గురైన రాజేంద్రప్రసాద్‌ ఇంట్లో అర్ధరాత్రి పూజలు ఏంటి అని ప్రశ్నిస్తూ వాహనాల కోసం ఉంచిన పెట్రోల్‌ను ఆమైపె పోసి ఉన్నాడు. అప్పుడు పూజ గదిలో వెలుగుతున్న దీపాలపై పెట్రోల్‌ పడి నిప్పు అంటుకుంది. ఆ నిప్పు హేమా బిందుకు అంటుకుంది. దీన్ని గమనించిన కుమారులు గుణశేఖర్‌, గురుసామి తల్లిని రక్షించడానికి ముందుకు రావడంతో వారికి కూడా నిప్పు అంటుకుంది. పెట్రోల్‌ పోసిన రాజేంద్రప్రసాద్‌కు కూడా నిప్పు అంటుకుంది. వారి అరుపులు విన్న స్థానికులు నిప్పు గాయాలతో ఉన్న నలుగురిని రక్షించి చికిత్స నిమిత్తం తిరుచ్చి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నావల్‌పట్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement