‘వేళచ్చేరి’చెరువు పునరుద్ధరణకు రెడీ
● 203 గృహాల కూల్చి వేతకు నిర్ణయం
సాక్షి, చైన్నె: వేళచ్చేరి చెరువు పునరుద్ధ్దరణకు అధికారులు రెడీ అయ్యారు. చెరువు స్థలంలో అక్రమంగా నిర్మించిన 203 గృహాలను తొలి విడతగా కూల్చి వేయడానికి చర్యలు చేపట్టారు. వివరాలు.. చైన్నెనగరం పరిధిలోని వేళచ్చేరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏటా ఈశాన్య రుతు పవనాల రూపంలో ఈ పరిసరాలు వరద ముంపునకు గురవుతున్నాయి. ఇక్కడి ప్రజలు తమ వాహనాలను పరిరక్షించుకునేందుకు వంతెనల మీద పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి. ప్రతి సంవత్సరం ఈ పరిసరాలు నీట మునిగేందుకు ప్రధాన కారణం వేళచ్చేరి చెరువు ఆక్రమణలకు గురై, ఆ నీరు నివాస ప్రాంతాలలోకి చొరబడటమే అని అధికారుల పరిశీలనలో తేలింది. ఈ చెరువు గతంలో 265 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఈ చెరువుకు గిండి, ఆదంబాక్కం, పరిసరాల నుంచి కాలువల ద్వారా నీళ్లు వస్తాయి. అయితే ఈమార్గాలన్నీ అన్యాక్రాంతమయ్యాయి. పెద్దపెద్ద భవనాలు, గృహాలు పుట్టుకొచ్చాయి. దీంతో వర్షం వస్తే చాలు ఇక్కడి ప్రజల గుండెలలో రైళ్లు పరుగెడుతుంటాయి. ఆ మేరకు ఏటా ఇక్కడి ప్రజలు కష్టాలు, నష్టాలను ఎదుర్కొంటున్నారు. దీంతో వేళచ్చేరి చెరువును పునరుద్ధరించే పనులపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం 55 ఎకరాలతో ఈ చెరువు ఉంది. పుర్వ వైభవం దిశగా దశల వారీగా ఆక్రమణలను తొలగించి చెరువును పునరుద్ధ్దరించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా తొలి విడతగా 25 నుంచి 30 ఎకరాల స్థలంలో ఉన్న 203 గృహాలను కూల్చి వేయడానికి సిద్ధమయ్యారు. ఈ గృహాల యజమానులకు ప్రత్యామ్నాయంగా గృహ నిర్మాణ సంస్థ ద్వారా స్థలాలను అందించేందుకు నిర్ణయించారు. అలాగే ఈ చెరువు ఉబరి నీరు ప్రవహించేందుకు 2.14 కి.మీ దూరం ఉన్న కాలువను సైతం విస్తరించే దిశగా ఆక్రమణల దారులపై కొరడా ఝుళిపించే విధంగా అధికారులు దూసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
వర్షం వస్తే చాలు నీట మునిగి అంబత్తూరు పారిశ్రామిక వాడను రక్షించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్తగా బైపాస్ రోడ్డు మీదుగా కూవం వరకు అతి పెద్ద కాలు వ నిర్మాణానికి నిర్ణయించారు. అంబత్తూరు, పారిశ్రామిక వాడ, కొరట్టూరు పరిసరాలు చిన్న పాటి వర్షానికి వరద ముంపునకు గురవుతున్నాయి. పారిశ్రామిక వాడలో కోట్లలో నష్టం అన్నది తప్పడం లేదు. దీనిని గుర్తెరిగిన ప్రభుత్వం ఇక్కడకు ఆ పరిసరాలలలోని చెరువుల నుంచి వచ్చే వరదల కట్టడి మీద దృష్టి పెట్టారు. ఇందుకోసం రూ. 130 కోట్లతో అంబత్తూరు నుంచి బైపాస్ రోడ్డు వెంబడి భారీ కాలువను తవ్వి కూవం నదిలో కలిపే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అలాగే వేళచ్చేరి సమీపంలోని పళ్లికరణై పరిసరాలు వరద ముంపునకు గురి కాకుండా 18 కిలోమీటర్ల దూరం ముట్టుకాడు వరకు పయనించే బకింగ్ హాం కాలువ మీద సైతం దృష్టి పెట్టారు. సముద్రంలో ఈ కాలువ కలిసే ప్రాంతం నుంచి 2 కి.మీ దూరం 3.81 కోట్లతో పూడిక తీత పునరుద్ధరణ పనులకు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment