అధిక నిధులు కేటాయించాలి
వేలూరు: ఉన్నత విద్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు కేటాయించాలని వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ అన్నారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఆవరణలో అందరికీ ఉన్నత విద్యా పథకం కింద స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అందరికీ ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతి ఏడాది స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నామన్నారు. ప్రస్తుతం 720 మందికి రూ.62 లక్షల ఉపకార వేతనాలు ఇస్తున్నామన్నారు. ఈ సంవత్సరం నుంచి వేలూరు ఉమ్మడి జిల్లాతోపాటు తిరువణ్ణామలై జిల్లాలోని విద్యార్థులకు ఇస్తున్నామని తెలిపారు. వేలూరు జిల్లాలో హిందువులు, ముస్లింలు ఉన్నప్పటికీ అన్నదమ్ములుగా కలసిమెలసి ఉంటున్నామన్నారు. అయితే విద్యలో మాత్రం వెనకబడి ఉన్నామని చెప్పారు. విద్యతోనే కుటుంబం, దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందగలవన్నారు. వీఐటీలో స్టార్స్ పథకాన్ని అమలు చేస్తున్నామని వీటి ద్వారా గ్రామీణ నిరుపేద విద్యార్థులను ప్రొత్సహించి ఉన్నత విద్యను అందజేసేందుకే ఈ పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు. అందరికీ ఉన్నత విద్యా పథకానికి వీఐటీలోని ప్రొఫెసర్‌లతోపాటు ప్రతి ఒక్క సిబ్బంది ఒక్క రోజు వేతనంతో పాటు దాతల ద్వారా నిధులను సేకరిస్తున్నామన్నారు. అనంతరం స్కాలర్‌షిప్‌ల చెక్కులను అందజేశారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి, ఎమ్మెల్యే కార్తికేయన్, అందరికీ ఉన్నత విద్యా ట్రస్ట్ కోశాధికారి జౌరీలాల్ జైన్, సభ్యులు లక్ష్మణన్, కేఎంజీ రాజేంద్రన్, లోకనాతన్, డాక్టర్ నర్మద, రాజేష్‌కుమార్ జైన్, మైలాంబిగై పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment