15 ఏళ్ల తర్వాత బియ్యం ఎగుమతులు
● చైన్నె హార్బర్ నుంచి ఓడలో తరలింపు
సేలం: చైన్నె హార్బర్ నుంచి 15 ఏళ్ల తర్వాత ఓడ ద్వారా ఇండోనేషియాకు బియ్యం ఎగుమతి చేపట్టారు. ఈ విషయం గురించి చైన్నె హార్బర్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. బియ్యంపై ఆంక్షలు, కనీస స్థాయి ఎగుమతి ధర నిర్ణయం వంటి పలు కారణాల వల్ల చైన్నె హార్బర్ నుంచి ఓడల ద్వారా బియ్యం ఎగుమతి చేయడం పూర్తిగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈఏడాది అక్టోబర్ 20న ఇండియా నుంచి అన్ని రకాల బియ్యం ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ ప్రకటించిందన్నారు. ఈ మేరకు 15 ఏళ్ల తర్వాత చైన్నె హార్బర్ నుంచి సరుకు రవాణా ఓడలో ఇండోనేషియాకు 5,100 మెట్రిక్ టన్నుల బియ్యం బస్తాలను రెండు పంపించినట్లు తెలిపారు. ఈ విషయంపై చైన్నె హార్బర్ రవాణా మేనేజర్ ఎస్.కృపానంద స్వామి సోమవారం మాట్లాడుతూ.. చైన్నె హార్బర్‌లో కొత్తగా 2 లక్షల మెట్రిక్ టన్నుల సరకులను భద్రపరిచే రీతిలో రూ. 25 కోట్లతో గిడ్డంగులను కొత్తగా నిర్మించి ఇటీవల వినియోగంలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా ఇదివరకే ఉన్న పాత గిడ్డంగులను పునరుద్ధరించడం ద్వారా వాటిలో సరకుల నిల్వ సామర్థ్యం 8 లక్షల మెట్రిక్ టన్నులు అధికమవుతుందన్నారు. ఇందుకోసం రూ. 52 కోట్ల వ్యయంతో పునరుద్ధరణ పనులు జరుపుతున్నామని తెలిపారు. 15 ఏళ్ల తర్వాత మళ్లీ బియ్యం ఎగుమతులు ప్రారంభించామన్నారు. ఈ స్థితిలో హార్బర్ అధికారులను చైన్నె హార్బర్ అధ్యక్షులు సునీల్ పాలీవాల్ సోమవారం నేరుగా పిలిపించి అభినందించారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment