మళ్లీ మాదే అధికారం! | - | Sakshi
Sakshi News home page

మళ్లీ మాదే అధికారం!

Published Fri, Dec 27 2024 2:24 AM | Last Updated on Fri, Dec 27 2024 2:24 AM

మళ్లీ మాదే అధికారం!

మళ్లీ మాదే అధికారం!

కూటమి బంధం ఏడేళ్లు

కొనసాగుతుందని సీఎం స్పష్టం

200 సీట్లకు పైగా గెలుస్తామని ధీమా

సీపీఐ నేత నల్లకన్ను శత జన్మదిన వేడుకలో స్టాలిన్‌

నల్లకన్నును సత్కరిస్తున్న సీఎం స్టాలిన్‌

సాక్షి, చైన్నె: డీఎంకే కూటమిలో మిత్రుల బంధం ఏడేళ్లని, ఈ బంధం పదిలంగా కొనసాగుతుందని సీఎం స్టాలిన్‌ అన్నారు. రానున్న ఎన్నికలలో 200 సీట్లకు పైగా గెలుచుకుని అధికారం మళ్లీ చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సీపీఐ సీనియర్‌ నేత నల్లకన్ను సేవలకు గుర్తింపుగా వైకుంఠం ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేస్తూ ‘కామ్రేడ్‌ నల్లకన్ను సెంటనరీ బిల్డింగ్‌’ అని నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో మరో రెండు ఆలయాలలో నిత్య అన్నదాన పథకానికి శ్రీకారం చుట్టారు.

స్వాతంత్య్ర సమరయోధుడిగా, సీపీఐ సీనియర్‌ నేతగా నల్లకన్ను అందరికీ సుపరిచితుడే. నిజాయితీకి ప్రతిరూపం. కనీసం సొంత ఇళ్లు కూడా ఆయనకు లేదు. ప్రభుత్వ గృహంలో ఉన్నా అద్దె చెల్లించే వారు. నేటికీ కుర్రాడిలా ముందుకు సాగే నల్లకన్ను గురువారం 100వ వసంతంలోకి అడుగు పెట్టారు. రాష్ట్ర రాజకీయాలలో, వయస్సులో ప్రస్తుతం సీనియర్‌ నేతగా నల్లకన్ను ఉన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని టీనగర్‌లోని సీపీఐ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. హాజరైన సీఎం స్టాలిన్‌ నల్లకన్నును సత్కరించారు. ఈసందర్భంగా జరిగిన సభలో సీఎం ప్రసంగిస్తూ ఈనెల 29న కలైవానర్‌ అరంగంలో పల నెడుమారన్‌ నేతృత్వంలో విపక్ష నేతలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు నల్లకన్ను అభినందన సభ జరగనున్నట్టు ప్రకటించారు. శత వసంతాల పుట్టిన రోజు వేడుకలకు తాను అభినందించడానికి రాలేదని ఆశీస్సులు స్వీకరించడానికి వచ్చానని అన్నారు. నల్లకన్ను లాంటి వారి నుంచి మార్గనిర్దేశం, మద్దతును ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కూటమి బంధం ఏడేళ్లని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో 200 సీట్లకుపైగా కూటమి గెలుచుకుని మళ్లీ అధికార పగ్గాలు చేపట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నల్లకన్నుకు గౌరవం కల్పించే విధంగా ఆయన సేవలకు గుర్తింపుగా తూత్తుకుడి జిల్లా శ్రీవైంకుఠం ప్రభుత్వ ఆస్పత్రిని అప్‌ గ్రేడ్‌ చేస్తున్నామని ప్రకటించారు. ఈ ఆస్పత్రికి ‘కామ్రేడ్‌ నల్లకన్ను సెంటనరీ బిల్డింగ్‌’ అని నామకరణం చేస్తున్నామని ప్రకటించారు. డీఎంకే కోశాధికారి, ఎంపీ టీఆర్‌బాలు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్‌, ఎండీఎంకే నేత వైగో, సీపీఎం నేత బాలకృష్ణన్‌, మంత్రులు కేఎన్‌ నెహ్రూ, పొన్ముడి, ఎమ్మెల్యే అబ్దుల్‌ సమద్‌ పాల్గొన్నారు.

నిత్యాన్నదాన పథకం

సచివాలయంలో జరిగిన పలు కార్యక్రమాలలో సీఎం స్టాలిన్‌ పాల్గొన్నారు. మదురై జిల్లాలోని అళగర మలైఅళగర్‌ ఆలయం, కోయంబత్తూరు జిల్లా మరుదమలై సుబ్రహణ్యస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. దిండుగల్‌ జిల్లా పళణిలోని దండాయుధపాణి ఆలయం నేతృత్వంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు ఆలయాల్లో నిత్యాన్నదాన పథకం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అలాగే, పళని ఆలయం తరఫున 2 పాఠశాలలు, నాలుగు కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించే విధంగా చర్యలు తీసుకుని శ్రీకారం చుట్టారు. మంత్రి శేఖర్‌బాబు, సీఎస్‌ మురుగానందం, దేవదాయశాఖ అధికారులు బీఎన్‌. శ్రీధర్‌, సి.హరిప్రియ, లక్ష్మణన్‌, బి.జయరామన్‌ పాల్గొన్నారు. మదురై అళగర్‌ ఆలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మూర్తి, కలెక్టర్‌ సంగీత, మరుదమలైలో కోవై కలెక్టర్‌ క్రాంతికుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement