కన్నీటి జ్ఞాపకం
● సాగరమా..శాంతించు ● తీరం కన్నీటి సంద్రం ● స్మారక స్తూపాల వద్ద నివాళి ● పాలాభిషేకం, పుష్పాంజలి ● సునామీ విషాదానికి 20 ఏళ్లు
కడలూరులో కొవ్వొత్తులు వెలిగించి మహిళలు నివాళి
కడలి వద్ద గవర్నర్ రవి, టీఎంసీ నేత వెంకటేష్ పాలతో నివాళి
సాక్షి, చైన్నె: సునామి ప్రళయానికి గురువారంతో 20 సంవత్సరాలైంది. కెరటాల ఆక్రోశంతో ఎగసిపడుతున్న సముద్రుడిని శాంతింపచేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా తీరవాసులు కదిలారు. చైన్నె నుంచి కన్యాకుమారి వరకు సముద్రతీర వాసులు మౌన ప్రదర్శనలు, పాలబిందెలతో ర్యాలీలు, కొవ్వొత్తులు వెలిగించి పాలాభిషేకాలతో సాగరమా..శాంతించు అంటూ వేడుకున్నారు. స్మారక స్తూపాల వద్ద పుష్పాంజలి ఘటించారు. సునామి మిగిల్చిన చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తీరంలో కన్నీటిసంద్రంలో మునిగారు.
2004 డిసెంబర్ 26న సుమత్రా దీవుల్లో ఏర్పడిన భారీ సునామి తమిళనాడునే కాదు, యావత్ సముద్ర తీర దేశాలలో ప్రళయాన్ని సృష్టించింది. ఈ విలయానికి రాష్ట్రంలోని సముద్ర తీరాల్లో పన్నెండు వేల మందికి పైగా ప్రజలు జల సమాధి అయ్యారు. లక్షలాది కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. సునామి సమయంలో మరణాల సంఖ్య నాగపట్నం జిల్లా కోడియకరై నుంచి పలయూరు వరకు అత్యధికంగా ఆరు వేల మంది విగత జీవులయ్యారు. వందలాది మృతదేహాలను ఒకే చోట ఖననం చేసి స్మారక స్తూపాలను ఏర్పాటు చేశారు. అలాగే, సముద్ర తీరాల్లో అక్కడక్కడ సునామి మృతుల్ని స్మరిస్తూ స్తూపాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ పరిణామాలతో ప్రతి ఏటా డిసెంబర్ నెల వస్తుందంటేచాలు రాష్ట్రంలోని తీర వాసులు గజగజ వణికిపోతుంటారు. ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో గత కొన్నేళ్లుగా ఈ నెలలో ఏదో ఒక తుపాన్ రూపంలో ప్రళయాన్ని తీర వాసులు చవి చూడక తప్పడం లేదు. ఈ ఏడాది కూడా ఫెంగల్ తుపాన్‌తో పాటు వాయుగుండం రూపంలో తీవ్ర కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితులలో సునామి ప్రళయం జరిగిన రోజైన గురువారం ప్రతి సంవత్సరంలా ఈసారి కూడా సముద్రుడిని శాంత పరిచే విధంగా చైన్నె నుంచి కన్యాకుమారి వరకు తీరవాసులు కార్యక్రమాలు నిర్వహించారు.
చైన్నెలో గవర్నర్ నివాళి
చైన్నెలో పట్టినంబాక్కం, కాశిమేడు, తిరువొత్తియూరు, ఎన్నూరు, నీలాంకరై, శ్రీనివాసపురం, కోవళం, చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం నుంచి పుదుపట్నం వరకు నివాళులర్పించే కార్యక్రమాలు జరిగాయి.పెద్ద ఎత్తు న జాలర్లు, స్థానికులు, పలు సంస్థల ప్రతినిధులు, పార్టీల నాయకులు సముద్ర తీరాల్లో కడలి తల్లికి అంజలి ఘటించారు. సముద్రపు మట్టితో సమా ధిని ఏర్పాటు చేసి, దానిపై పువ్వులు చల్లారు. కొవ్వొత్తులను వెలిగించి నివాళులర్పించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ర్యాలీలు, మౌన ప్రదర్శనలు సముద్ర తీరం వైపు సాగాయి. పుష్పాలను తట్టల్లో ఉంచి, పాలబిందెలతో మహిళలు ఊరేగింపుగా సముద్ర తీరానికి చేరుకుని అంజలి ఘటించారు. పట్టినంబాక్కంలో రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీఆర్.వెంకటేష్, జాలర్ల సంఘం నేత అన్బలగన్, సముద్రుడికి నివాళులర్పించారు. అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ నేతృత్వంలో ర్యాలీ జరిగింది.
తీరంలో నివాళి..
చైన్నె, చెంగల్పట్టు, కడలూరు, నాగపట్నం, పుదుకోట్టై, తూత్తుకుడి, రామనాథపురం, కన్యాకుమారి వరకు ఉన్న సముద్ర తీర జిల్లాల్లో సముద్రుడిని శాంతింప చేసే విధంగా ఉదయాన్నే పాలాభిషేకాలు జరిగాయి. సునామి వంటి పెనువిపత్తులు మళ్లీ పునరావృతం కాకూడదని కాంక్షిస్తూ, ఈ ప్రళయంలో జల సమాధి అయిన వారిని స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు, శాంతి ర్యాలీలు, మౌన ప్రదర్శనలు జరిగాయి. బాధిత కుటుంబాలు తమ వాళ్లను తలచుకుంటూ కన్నీటి నివాళులర్పించాయి. సముద్ర తీరాల్లో అక్కడక్కడ సునామి మృతుల్ని స్మరిస్తూ ఏర్పాటు చేసిన స్తూపాల వద్ద తమ కన్నీటి రోదనలు మిన్నంటాయి. కన్యాకుమారిలోని సముద్ర తీర దేవాలయాలలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. కొవ్వొత్తులు వెలిగించి అంజలి ఘటించారు. పార్టీలకు అతీతంగా నాయకులు, జాలర్ల కుటుంబాలు పెద్ద ఎత్తున సముద్ర తీరానికి తరలి వచ్చి అంజలి ఘటించాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా జాలర్లు చేపల వేటకు వెళ్ల లేదు. వేదారణ్యం, కడలూరు సింగారతోపు గ్రామాల ప్రజలు భారీ ఊరేగింపుగా వచ్చి సముద్రంలో పాలను పోసి మృతులకు నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment