గద్దె దించే దాకా చెప్పులేసుకోను!
● అన్నామలై శపథం
● నేడు ఆరు కొరడా దెబ్బలకు నిర్ణయం
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో డీఎంకేను గద్దె దించే దాకా తాను చెప్పులు వేసుకోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై శపథం చేశారు. అన్నావర్సిటీలో జరిగిన దారుణ ఘటనకు నిరసనగా శుక్రవారం తన ఇంటి వద్ద ఆరు కొరడా దెబ్బలను తానుకొట్టుకోనున్నట్టు ప్రకటించారు. గురువారం కోయంబత్తూరులో అన్నామలై మీడియాతో మాట్లాడుతూ అన్నావర్సిటీ ఘటనను ఖండిస్తూ, రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అత్యుత్తమ విద్యా సంస్థల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, వైర్ కనక్షన్లు ఇవ్వకపోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఇక్కడ విద్యార్థినులకు భద్రత లేదన్నది స్పష్టమవుతోందన్నారు. పట్టుబడ్డ నిందితుడు డీఎంకే ముసుగులో లైంగిక దాడులకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. డీఎంకేలోని ఓ ముఖ్యనేత, మంత్రితో అతడికి సంబంధం ఉన్నట్టు పేర్కొంటూ, ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి పేరు, వివరాలు, మొబైల్ నంబర్లే కాకుండా, ఎఫ్‌ఐఆర్ ఎలా లీక్ అయిందో పోలీసులు చెప్పాలని పట్టుబడ్డారు. యువతి వివరాలను బహిర్గతం చేసి ఆమె జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేయడం తలదించుకోవాల్సిన విషయంగా పేర్కొన్నారు. నిరసనగా శుక్రవారం తన నివాసం వద్ద ఆరు కొరడా దెబ్బలను స్వయంగా కొట్టుకోనన్నట్టు ప్రకటించారు. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు చెప్పులు వేసుకోనని ఇదే నా శపథం అని అన్నారు. అన్నావర్సిటీ ఘటనను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కోఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment