జల్లికట్టుకు కసరత్తు
● అలంగానల్లూరులో పూజలతో ఏర్పాట్లు ● నేడు పుదుకోట్టైలో లాంఛనంగా తొలి వేడుక
సాక్షి, చైన్నె: తమిళుల సాహస క్రీడ జల్లికట్టుకు రాష్ట్రంలో ఏర్పాట్లు మొదలయ్యాయి. జల్లికట్టుకు ప్రసిద్ధి చెందిన అలంగానల్లూరులో పూజల అనంతరం వాడి వాసల్ వద్ద ఏర్పాట్లకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఇక, ఈ ఏడాది తొలి జల్లికట్టుకు పుదుకోట్టైలో శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. తమిళుల సంప్రదాయ, సాహస క్రీడగా జల్లికట్టు ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. మదురై జిల్లా అవనియాపురం, పాలమేడు, అలంగానల్లూరులలో సంక్రాంతి సందర్భంగా వీరత్వాన్ని చాటే విధంగా పోటీలు జరుగుతుంటాయి. ఇందులో అలంగానల్లూరులో పోటీ ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా పోటీల నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. అవనియాపురంలో 14వ తేదీన, పాలమేడులో 15న, 16న అలంగానల్లూరులో పోటీలకు సిద్ధమయ్యారు. ఈ పోటీల నిర్వహణ కోసం చేసే ఏర్పాట్లకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. పాలమేడు మంజమలై దిడల్ వద్ద, అలంగానల్లూరులో ముత్తాలమ్మన్ ఆలయం వద్ద పూజల అనంతరం పందిరి గుంజం నాటి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. మంత్రి మూర్తి, అధికారులు, నిర్వాహకులు పాల్గొన్నారు.
నేడు పుదుకోట్టైలో..
జల్లికట్టు అంటే సంక్రాంతి వేళ సాగే అవనీయాపురం, పాలమేడు, అంగానల్లూరు ముఖ్య వేదికల పోటీలు కీలకం. అయితే, ప్రతి ఏటా తొలి పోటీ అనేది లాంఛనంగా పుదుకోట్టైలో మొదలవుతుంది. పుదుకోట్టై జిల్లా గంధర్వకోట సమీపంలోని తచ్చన్‌కురిచ్చిలో తొలి జల్లికట్టుకు సర్వం సిద్ధం చేశారు. ఇక్కడ జరిగిన ఏర్పాట్లను పుదుకోట్టై కలెక్టర్ అరుణ పరిశీలించి పోటీల నిర్వహణకు అనుమతి ఇచ్చారు. దీంతో శనివారం జల్లికట్టు సంబరం తచ్చన్ కురిచ్చిలో హోరెత్తనుంది. ఇదిలాఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సంక్రాంతి బోనస్‌ను ప్రకటించి, ముందుగా పంపిణీ చేయడానికి సీఎం స్టాలిన్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment