మహిళలకు మంచి పాత్రలు
మలయాళంలో
తమిళసినిమా: మలయాళం చిత్రాల్లో మహిళలకు మంచి కథాపాత్రలు రాస్తారని నటి త్రిష పేర్కొన్నారు. 40 ప్లస్ లోను క్రేజీ కథానాయకిగా వెలిగిపోతున్న నటి ఈమె. తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ నటిస్తున్న త్రిష తాజాగా మలయాళంలో కథానాయకిగా నటించిన చిత్రం ఐడెంటిటీ. నటుడు టోవినో థామస్ కథానాయకుడిగా నటించిన ఇందులో నటుడు వినయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రాగం మూవీస్ పతాకంపై రాజు మల్లయత్, కాన్ఫిడెంట్ గ్రూప్ అధినేత సీజే రాయి కలిసి నిర్మించిన ఈ చిత్రానికి అఖిల్ పాల్, అనస్కారన్ ద్వయం దర్శకత్వం వహించారు. అఖిల్ జార్జ్ ఛాయాగ్రహణం, జాక్స్ బిజాయ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గతవారం మలయాళంలో విడుదలై మంచి ప్రేక్షకాదరనతో ప్రదర్శింపబడుతుంది. కాగా తాజాగా తమిళంలో అనువాదం చేయబడి ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్ చైన్నెలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటి త్రిష మాట్లాడుతూ సాధారణంగానే మలయాళంలో మంచి కథా చిత్రాలు రూపొందుతాయన్నారు. తనకు మలయాళ చిత్రాలంటే చాలా ఇష్టం అని చాలా సార్లు చెప్పానని, ఆ చిత్రాలంటే తనకు చాలా మర్యాద అని పేర్కొన్నారు. అలా ఏడాదికి ఒక్క మలయాళ చిత్రమైన చేయాలని అనుకునేదాన్ని. అలాంటి సమయంలో వచ్చిన అవకాశమే ఈ ఐడెంటిటీ చిత్రం అని చెప్పారు. చాలా తెలివైన కథనం తనకు బాగా నచ్చింది అన్నారు. దర్శకుడు అఖిల్ కథ చెప్పిన విధానమే అద్భుతం అనిపించిందన్నారు. తోవినో థామస్ మలయాళంలో స్టార్ హీరో అని ఆయన ఎంపిక చేసుకుని నటించే చిత్రాలు తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఆయనతో కలిసి ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవం అని అభిప్రాయపడ్డారు. షూటింగ్ చేస్తున్నప్పుడే ఈ చిత్రం విజయం సాధిస్తుందని నమ్మినట్లు త్రిష పేర్కొన్నారు. ఐడెంటిటీ చిత్రాన్ని తమిళపేక్షకులు ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని నటుడు టోవినో థామస్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment