కరెంట్‌షాక్‌తో వివాహిత బలి
– విద్యుత్ లేన్లు మార్చాలని రాస్తారోకో
తిరువళ్లూరు: ఇనుమ కమ్మీలతో నిమ్మకాయలు కోయడానికి యత్నించిన వివాహిత విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. మహిళ మృతితో ఆగ్రహించిన స్థానికులు నివాస ప్రాంతాల మీదుగా వెళ్తున్న విద్యుత్ లేన్లను వెంటనే మార్చాలని, మృతిరాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ రాస్తారోకోకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. తిరువళ్లూరు జిల్లా వరదాపురం ప్రాంతానికి చెందిన భక్తాచలం. ఇతడి భార్య లోకేశ్వరి(42). వీరికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈమె ఇంటిపై నుంచి నిమ్మకాయలను కోయడానికి ఇనుపరాడ్‌తో యత్నించినట్టు తెలిసింది. ఆ సమయంలో ఇనుప రాడ్ విద్యుత్ లేన్లకు తాకడంతో షాక్‌కు గురై కిందపడింది. వెంటనే బంధువులు ఆమెను తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే మహిళ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆగ్రహించిన మహిళ బంధువులు విద్యుత్ లేన్లను మార్చాలని కోరుతూ రాస్తారోకోకు దిగారు. విషయం తెలిసి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు. ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment