● నేడూ రేషన్ దుకాణాలు పనిచేస్తాయన్న ప్రభుత్వం ● బ్యాంక
సాక్షి, చైన్నె: సంక్రాంతి సంబరాల వేళ రేషన్ దుకాణాల ద్వారా కానుకల పంపిణీకి గురువారం సీఎం స్టాలిన్ లాంఛనంగా శ్రీకారం చుట్టారు. శుక్రవారం కూడా రేషన్ దుకాణాలు పని చేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. వివరాలు.. ఇంటిళ్లి పాది సంక్రాంతిని ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్న కాంక్షతో ఏటా కుటుంబ రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం కానుకను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. కుటుంబ కార్డు దారులు(రేషన్ – బియ్యం కార్డు), పునరావాస శిబిరాలలోని ఈలం తమిళులందరికీ ఈ కానుక వర్తింప చేస్తున్నారు. రాష్ట్రంలోని 36 వేల రేషన్ దుకాణాల ద్వారా ఈ కానుకల పంపిణీకి ఈ ఏడాది కూడా చర్యలు తీసుకున్నారు. అయితే ఈ సారి నగదు కానుకను పక్కన పెట్టి, కేవలం బియ్యం, చక్కెర, చెరుకు అందజేతకు చర్యలు తీసుకున్నారు.
పంపిణీకి శ్రీకారం..
చైన్నె సైదా పేట చిన్నమలై రేషన్ దుకాణంలో సంక్రాంతి కానుకగా వస్తువుల పంపిణీకి ఉదయం చర్యలు తీసుకున్నారు. లబ్ధిదారులకు కిలో పచ్చి బియ్యం, కిలో చక్కెర, చెరుకు గడ పంపిణీకి సీఎం స్టాలిన్ శ్రీకారం చుట్టారు. 2,20,94,585 కుటుంబ కార్డు దారులకు వీటి పంపిణీ నిమిత్తం ఇప్పటికే ఆయా రేషన్ దుకాణాల పరిధిలో టోకెన్లను అందజేశారు. ఈ పంపిణీ నిమిత్తం శుక్రవారం సైతం దుకాణాలు పని చేస్తాయని ప్రకటించారు. అలాగే ఉచిత చీర, ధోవతి పథకం కింద కోటి 77 లక్షల 22 వేల మందికి వర్తింపజేశారు. లబ్ధిదారులకు సీఎం స్టాలిన్ పొంగల్ గిఫ్ట్ ప్యాక్‌తో పాటూ చీర ధోవతి అందజేశారు. పొంగల్ కానుక కిట్ల పంపిణీ పథకం కోసం రూ. 249 కోట్లు కేటాయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెరియకరుప్పన్, చక్రపాణి, మేయర్ ప్రియ, సహకార కార్యదర్శి జేరాధాకృష్ణన్, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి అముదా తదితరులు పాల్గొన్నారు.
బ్యాంక్ ఖాతాలో జమ..
ఎన్నికల వాగ్దానం మేరకు గృహిణుల నెలకు రూ. 1000 నగదు పంపిణీ నిమిత్తం కలైంజ్ఞర్ మహిళ హక్కు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా ముందుగానే గురువారం బ్యాంక్ ఖాతాలలో ఆ మొత్తాన్ని జమ చేశారు. సాధారణంగా ప్రతి నెలా 15వ తేదీన రూ. 1000 నగదు బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తున్నారు. అయితే ఈనెల సంక్రాంతి పండుగ కావడంతో కోటి 14 లక్షల 61 వేల మందికి ముందుగానే బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేశారు. ఇదిలా ఉండగా, సంక్రాంతికి రాష్ట్ర ప్రభుత్వ రంగం రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను ప్రకటించిన నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లే వారు 1.32 లక్షల మంది ముందుగా రిజర్వేషన్లు చేసుకున్నారు. అలాగే చైన్నె కోయంబేడులో సంక్రాంతి ప్రత్యేక మార్కెట్ ప్రారంభమైంది. ఇక, ఈనెల 15వ తేదిన కనుమ సందర్భంగా మాంసం దుకాణాల మూతకు ప్రభుత్వం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment