పళణికి ఊరట
● సీఈసీ విచారణకు స్టే
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళణి స్వామి ఎంపిక విషయంగా కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణకు మద్రాసు హైకోర్టు గురువారం స్టే విధించింది. వివరాలు.. అన్నాడీఎంకేలో వివాదాలు, చీలికల పర్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అన్నాడీఎంకేను పూర్తిగా మాజీ సీఎం ఎడపాడి పళణి స్వామి తన గుప్పెట్లోకి తీసుకున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆయన పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టి, బలోపేతం దిశగా ముందుకెళ్తున్నారు. అదే సమయంలో అన్నాడీఎంకే వివాదాలు, రెండాకుల గుర్తు వ్యవహారం, పళణి ప్రధానకార్యదర్శిగా ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలు పిటిషన్లు విచారణలో ఉన్నాయి. ఈ పరిస్థితులలో రెండాకుల వివాదంలో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్ పళణి స్వామి ప్రధానకార్యదర్శిగా ఎంపికై న విషయంగా విచారణ మీద దృష్టి పెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ పళణి స్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. అన్నాడీఎంకే సర్వ సభ్యసమావేశ సభ్యులు, పార్టీ సభ్యులుగా ఎలాంటి పదువులో లేని వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్నికల కమిషన్‌కు విచారణ జరిపే అధికారం లేదని కోర్టుకు పళణి స్వామి వివరించారు. గురువారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. వాదనల సమయంలో ఎన్నికల కమిషన్ తీరు, తమ పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకునే అధికారం వారికి లేదన్నట్టుగా పళణి స్వామి తరపున వాదనలుకోర్టు ముందు ఉంచారు. వాదనల అనంతరం న్యాయమూర్తులు స్పందిస్తూ ఎన్నికల కమిషన్ విచారణకు స్టే విధించారు. వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశిస్తూ విచారణను ఈనెల 27వతేదీకి వాయిదా వేశారు.
దారుశిల్పి కె. శ్రీనివాసరావుకు ప్రథమ బహుమతి
సాక్షి, చైన్నె : నగరానికి చెందిన ప్రముఖ దారుశిల్పి కె. శ్రీనివాసరావు కాంచీపురం మండల కళా, సాంస్కృతిక కేంద్రం నిర్వహించిన చిత్రకళ, శిల్ప ప్రదర్శనలో ప్రథమ బహుమతిని అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కళలు సాంస్కృతిక శాఖ, కాంచీపురం మండల కళ, సాంస్క్కతిక కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో చిత్రకళ శిల్ప ప్రదర్శన ఈ నెల 7, 8 తేదీలలో ఆర్కాడు శ్రీ రామకృష్ణ మెట్రిక్ మహోన్నత పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంచీపురం కళ, సాంస్కతిక కేంద్రం, అసిస్టెంట్ డైరెక్టర్ సి. నీలమేఘన్, రాణిపేట పర్యాటక అధికారి, పి.ఇలమురుగన్, వేలూరు జిల్లా ప్రభుత్వ మ్యూజియం క్యూరేటర్ కె.శరవణన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇందులో పోరూరు ముగలివాక్కానికి చెందిన శ్రీనివాస వుడ్ వర్క్స్ వ్యవస్థాపకులు, శిల్పకారులు కడియం శ్రీనివాసరావు తన శిల్ప కళాఖండాలకు కాంచీపురం మండల కళా, సాంస్కృతిక కేంద్రం తరపున మొదటి బహుమతిని దక్కించుకున్నారు. ఆయన్ని నగదు పురస్కారంతో అధికారులు సత్కరించారు.ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ మెట్రిక్యులేషన్ పాఠశాల, కార్యదర్శి కె సొల్ ముత్తమిలన్, ఆర్కాడు మునిసిపల్ అధ్యక్షులు దేవి బెంజ్ పాండియన్ పాల్గొన్నారు.
జూలై వరకు తాగునీటికి కొరత లేదు
తిరువొత్తియూరు: చైన్నెలో ఈ సంవత్సరం జూలై 25 వరకు తాగునీటికి సమస్య ఉండదని మంత్రి కేఎన్ నెహ్రూ తెలిపారు. రాయపురం నియోజకవర్గానికి అదనంగా తాగునీరు అందించడానికి చర్యలు తీసుకుంటారా? అని శాసనసభలో సభ్యులు మూర్తి ప్రశ్న లేవదీశారు. అందుకు కార్పొరేషన్ నిర్వాహక శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ మాట్లాడుతూ చైన్నెకి 13.22 టీఎంసీల నీరు అవసరం కాగా.. ప్రస్తుతం 15.56 టీఎంసీలు నిల్వ ఉన్నాయని ఫలితంగా చైన్నెలో ఈ ఏడాది జూలై వరకు తాగునీటికి సమస్యలు ఉండదని స్పష్టం చేశారు.
10 మంది తమిళ జాలర్ల అరెస్టు
సేలం : సరిహద్దులు దాటి చేపలు పట్టారని ఆరోపిస్తూ తమిళ జాలర్లు 10 మందిని శ్రీలంక సముద్రతీర బలగాలు అరెస్టు చేశాయి. వివరాలు..నాగపట్నం హార్బర్ నుంచి కారైకాల్ జాలర్లు చేపలు పట్టడం కోసం బుధవారం రాత్రి సముద్రంలోకి వెళ్లారు. వీరులో కొందరు శ్రీలంక సముద్ర హద్దుల్లో చేపలు పడుతున్నట్టు తెలిసింది. కారైకాల్ సమీపంలో చేపలు పడుతున్న 10 మంది జాలర్లను శ్రీలంక సముద్ర తీర బలగాలు గురువారం వేకువజామున అరెస్టు చేసి, వారి పడలను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత వారిని కాంగేశన్ హార్బర్‌కు తీసుకెళ్లారు. కాగా ఈ 10 మంది జాలర్లను విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విదేశాంగ మంత్రి జయశంకర్‌కు లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment