సబ్‌వేలు ఏర్పాటు చేయాలి
పళ్లిపట్టు: మండలంలోని రైలు మార్గంలో సబ్‌వేలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఆంధ్రాలోని నగరి నుంచి తమిళనాడులోని విల్లుపురం జిల్లా దిండివనం వరకు 180 కిలోమీటర్ల దూరం రైలు మార్గానికి గత 2004లో కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకటించింది. 2007లో రైలు మార్గానికి సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. పళ్లిపట్టు, ఆర్కేపేట, షోళింగర్, వాలాజా, రాణిపేట, వందవాసి సహా దిండివనం వరకు రైతుల నుంచి స్థలం సేకరించి వారికి నష్టపరిహారం సైతం చెల్లించారు. 18 ఏళ్లుగా పథకం పనులకు సంబంధించి నిధులు మంజూరులో చోటుచేసుకున్న జాప్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల రైతుల నుంచి పొలాలు సేకరించి రైల్వే లైన్ ఏర్పాటుకు సంబంధించి మట్టి రోడ్డు పనులు జరుగుతున్నాయి. దీంతో గ్రామాలు, పొలాల మధ్య దారులు లేకపోవడంతో గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు. కేశవరాజుకుప్పం, గొళ్లాలకుప్పం, పొదటూరుపేటలోని కన్నికాపురం, కీళపూడి, పెరమానళ్లూరు, అత్తిమాంజేరిపేట ప్రాంతాల్లో రైల్వేలైన్ వద్ద సబ్‌వే ఏర్పాటు చేయాలని రైతులు రెండేళ్లుగా కోరుతున్నారు. అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో పంట పొలాలకు వెళ్లి రావడం, గ్రామాలకు వెళ్లడం కష్టంగా మారింది. రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న క్రమంలో కిలోమీటర్ దూరంలో రైల్వే లైన్ ప్రాంతంలో సబ్‌వే ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ సబ్‌వేల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment