![మార్చిలో పట్టాలపైకి ఏసీ ‘ఈఎంయూ’](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06cni07-600560_mr-1738873114-0.jpg.webp?itok=gD36Ap5s)
మార్చిలో పట్టాలపైకి ఏసీ ‘ఈఎంయూ’
● బీచ్ టూ తాంబరం మధ్య నడిపేందుకు చర్యలు ● రైలుకు తుది మెరుగులు
సాక్షి, చైన్నె: బీచ్ నుంచి తాంబరం వైపుగా ఈఎంయూ(ఎలక్ట్రిక్) ౖరైలు సేవలను మార్చిలో మొదలెట్టేందుకు రైల్వే యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈమేరకు ఐసీఎఫ్‌లో రెండు ఏసీ ఈఎంయూలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఈ నెలాఖరులో ట్రయల్ రన్‌కు అవకాశాలు ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. వివరాలు.. చైన్నె రవాణా మార్గంలో ఈఎంయూ సేవలు కీలకం. చెంగల్పట్టు నుంచి తాంబరం – బీచ్ వైపుగా ఓ మార్గం, సెంట్రల్ నుంచి అరక్కోణం , తిరుత్తణి వైపుగా, గుమ్మిడి పూండి , సూళురు పేట వైపుగా ఈఎంయూ సేవలు సాగుతున్నాయి. బీచ్ నుంచి తాంబరం వైపుగా చెంగల్పట్టు, మరైమలై నగర్ వరకు నిత్యం రైళ్లు పట్టాలు ఎక్కుతుంటాయి. తాంబరం – బీచ్ మధ్య పది లేదా ఇరవై నిమిషాలకు ఓ రైలు పరుగులు తీస్తుంటుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు అన్ని రైళ్లు క్రిక్కిరిసిన పయనంతో సాగాల్సిందే. ఈ సమయంలో కొన్ని ఫాస్ట్ ఈఎంయూలను సైతం నడుపుతున్నారు. ఈ రైళ్ల కోసం చెంగల్పట్టు, తాంబరం, క్రోంపేట, పల్లావరం, గిండి, మాంబలం, కోడంబాక్కం స్టేషన్లలో జనం కిక్కిరిసి ఉంటారు. ఈ నేపథ్యంలో మెట్రో రైలుకు లభిస్తున్న ఆదరణను పరిగణించి ఈఎంయూను ఏసీ మయం చేయడానికి తగ్గ పరిశీలన ఇటీవల చేపట్టారు. బీచ్ నుంచి చెంగల్పట్టు వైపుగా కిక్కిరిసిన పయనంలో ఉండే ప్రయాణికులు ఏసీ బోగిలలో కూర్చునే రీతిలో అవకాశం కల్పించేందుకు తగ్గ చర్యల మీద దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా తొలి విడతగా బీచ్ – తాంబరం మధ్య ఏసీ ఈఎంయూ రైలు నడిపేందుకు సిద్ధమవుతున్నారు. చైన్నె ఐసీఎఫ్‌లో రెండు ఏసీ ఈఎంయూ రైలు రూపుదిద్దుకుంటోంది. వేసవి కాలంలో ఈ రైలుకు మరింత ఆదరణ లభించే అవకాశాలతో మార్చిలో పట్టాలపైకి తెచ్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. 12 బోగిలతో కూడిన ఒక ఈఎంయూ రైలులో 1320 మందికూర్చునేందుకు వీలుగా సీట్ల అమరికలు చేపట్టి ఉన్నారు. రెండు వారాలలో ఈ ఏసీ రైలును దక్షిణ రైల్వేకు ఐసీఎఫ్ వర్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఓ వారం రోజుల పాటుగా బీచ్ – తాంబరం మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించి, మార్చి మొదటి లేదా రెండో వారంలో పట్టాలపైకి తెచ్చే దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. అయితే, ఈ రైలులో చార్జీలు సాధారణ ఈఎంయూ కంటే ఐదారింతలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. 9కి.మీ దూరానికి రూ. 35, 15 కి.మీ దూరానికి రూ.50, 24 కి.మీ దూరానికి రూ. 70, 34 కి.మీ దూరానికి రూ. 95గా చార్జీ అమలు చేసే పరిశీలన సాగుతోన్నట్టు రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ట్రయల్ రన్ తర్వాత చార్జీల ప్రకటన అధికారికంగా ఉంటుందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment