ఆస్తి పన్ను బకాయిలపై కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

ఆస్తి పన్ను బకాయిలపై కన్నెర్ర

Published Fri, Feb 7 2025 2:08 AM | Last Updated on Fri, Feb 7 2025 2:08 AM

ఆస్తి పన్ను బకాయిలపై కన్నెర్ర

ఆస్తి పన్ను బకాయిలపై కన్నెర్ర

సాక్షి, చైన్నె: ఏళ్ల తరబడి ఆస్తి తదితర పన్నులు చెల్లించకుండా కాలం నెట్టుకొస్తున్న 2 లక్షల మందిపై చైన్నె కార్పొరేషన్‌ కన్నెర్ర చేసింది. మొండి బకాయిల వసూళ్ల కోసం వినూత్న మార్గంలో చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2 లక్షల మందికి క్యూర్‌కోడ్‌తో నోటీసుల జారీకి చర్యలు తీసుకుంది. వివరాలు.. రాజధాని నగరం చైన్నె కార్పొరేషన్‌ పరిధిలో వివిధ రకాల పన్నుల వసూలు అధికారులకు కష్టతరంగా మారింది. మొండి బాకాయిల్ని వసూలు చేయడానికి వినూత్న పంథాలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సకాలంలో ఆస్తి, నీటి తదితర పన్నులను వినియోగ దారులు చెల్లించే ప్రక్రియను కార్పొరేషన్‌ సులభతరం చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపు ప్రక్రియకు సైతం అవకాశాలు ఉన్నా, కొందరు పన్నుల చెల్లింపులో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారింది. దీంతో వీరి వద్ద ముక్కుపిండి మరీ బకాయిల వసూలుకు చర్యలు తీసుకుకోవాల్సి ఉంది. గతంలో బకాయి పెట్టిన బహుళ అంతస్తుల భవనాలు, సంస్థలు, కార్యాలయాల ముందు హిజ్రాల ద్వారా డ్యాన్సులు వేయించడం, డప్పుల హోరుతో వారి పరువు బజారు కీడ్చే దిశగా ముందుకు సాగడం వంటి ప్రయత్నాలను కార్పొరేషన్‌ వర్గాలు చేశాయి.

కార్పొరేషన్‌ భవనం

2 లక్షల మందికి నోటీసులు

చైన్నెలో ఏటా రెండు విడతలుగా పన్నుల చెల్లింపునకు అవకాశం కార్పొరేషన్‌ వర్గాలు కల్పించాయి. ప్రస్తుతం పన్నుల రూపంలో కార్పొరేషన్‌కు రూ.1,660 కోట్లు రాబడి వచ్చింది. గతంతో పోల్చితే ఈసారి రూ. 250 కోట్లు పన్నుల రూపంలో అదనంగా రాబడి వచ్చినట్లయ్యింది. అయినా పన్నులు ఇంకా చెల్లించకుండా బకాయిలు పెట్టే వారు ఉండడంతో వారి భరతంపట్టేందుకు సిద్ధమయ్యారు. 2 లక్షల మందికి క్యూర్‌ కోడ్‌తో కూడిన నోటీసులు జారీ చేసే పనిలో కార్పొరేషన్‌ వర్గాలు గురువారం చర్యలు తీసుకున్నారు. ఈ క్యూర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌ ద్వారా పన్ను చెల్లింపునకు అవకాశం కల్పించారు. 2 లక్షల మందిలో బహుళ అంతస్తులు, వాణిజ్య సంస్థలే అధికంగా ఉండడం గమనార్హం. ఈ నోటీసుకు స్పందించని పక్షంలో తదుపరి కార్యాచరణకు కార్పొరేషన్‌ వర్గాలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

2 లక్షల మందికి క్యూఆర్‌ కోడ్‌తో నోటీసులు

చైన్నె కార్పొరేషన్‌ చర్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement