సీమాన్‌కు హైకోర్టు షాక్
సాక్షి, చైన్నె: నామ్ తమిళర్ కట్చి కన్వీనర్‌సీమాన్‌కు మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలపై నమోదైన కేసు విచారణను ఎదుర్కోవాల్సిందేనని న్యాయమూర్తి వేల్ మురుగన్ గురువారం ఆదేశించారు. వివరాలు.. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్‌కు వివాదాలు కొత్తేమీ కాదన్న విషయం తెలిసిందే. ఆయనపై అనేక కేసులు విచారణలో ఉన్నాయి. ఒకర్ని టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు చేయడమే కాకుండా, తాడా పేడో తేల్చుకునే విధంగా కయ్యానికి కాలు దువ్వడం ఆయనకు అలవాటే. గతంలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసి ఏళ్ల తరబడి కేసు విచారణను ఎదుర్కొంటూ వస్తున్నారు. విక్రవాండి కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. తరచూ విచారణ నిమిత్తం విక్రవాండి కోర్టుకు సీమాన్ హాజరు కావాల్సిన పరిస్థితి. ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో సీమాన్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు ముగియడంతో గురువారం న్యాయమూర్తి వేల్ మురుగన్ స్పందిస్తూ ఈ కేసులో వ్యక్తిగత విమర్శలు , ఆరోపణలు చేసినట్టుగా సాక్షుల వాంగ్మూలం, ఆధారాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఈ కేసు విచారణను సీమాన్ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. అదే సమయంలో ఆయన తరపు న్యాయవాదులకు న్యాయమూర్తి హితవు పలికారు. ఇటీవల కాలంగా సీమాన్ చేస్తున్న వ్యాఖ్యలను చూస్తున్నానని, పరిశీలిస్తున్నానని పేర్కొంటూ వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు, వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సీమాన్‌కు సలహా ఇవ్వండి అని సూచించారు. కేసు విచారణకు స్వయంగా హాజరయ్యే విషయంలోనైనా మినహాయింపు ఇవ్వాలని సీమాన్ తరపున విజ్ఞప్తి చేయగా, అందుకు కూడా న్యాయమూర్తి వేల్ మురుగన్ నిరాకరించారు. దీంతో ఈ కేసు విచారణను ఎదుర్కోవడంతో పాటూ స్వయంగా విక్రవాండి కోర్టుమెట్లు ఎక్కాల్సిన పరిస్థితి సీమాన్‌కు నెలకొంది.
విచారణ ఎదుర్కోవాల్సిందేనని
ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment