అంతా మోసమే!
● కేంద్రం తీరుపై సీఎంస్టాలిన్ ఆగ్రహం ● రూ. 1.304 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం ● రూ. 309 కోట్ల పనులకు శంకుస్థాపన
సాక్షి, చైన్నె : ఏదీ నిధి..ఏదీ న్యాయం..అంతా మోసమే...తిరునల్వేలి హల్వా కంటే..బీజేపీ పెట్టే హల్వాకే ప్రాధాన్యత అంటూ సీఎం స్టాలిన్ చమత్కారాలతో కేంద్రం తీరును ఎండగట్టారు. శుక్రవారం తిరునల్వేలిలో రూ.1,304 కోట్లతో పూర్తి చేసిన పనులను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. రూ.309 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు.
క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా గురు, శుక్రవారం సీఎం స్టాలిన్ తిరునల్వేలి జిల్లాలో పర్యటించారు. తొలి రోజున గంగై కొండన్ పారిశ్రామిక వాడలో రూ.3,800 కోట్లతో టాటా పవర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. రూ.2,574 కోట్లతో విక్రమ్ మాడ్యూల్ తయారీ ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేశారు. పాళయం కోట్టైలోని గాంధీ మార్కెట్‌ను సందర్శించారు. ఇక్కడ షాపింగ్ మాల్, నైనార్ చెరువు పరిసరాల్లో పిల్లల ఆట మైదానాన్ని ప్రారంభించారు. రాత్రి తిరునల్వేలి జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. తిరునెల్వేలి నగర అభివృద్ధి ప్రాజెక్టు కింద చేపట్టిన తామర భరణి నదీ తీరం పునరుద్ధరణ పనులను పరిశీలించారు. శుక్రవారం తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు. ఇక్కడి మైదానంలో జరిగిన బహిరంగ సభ వేదికగా రూ.1,304.66 కోట్లతో పూర్తిచేసిన 24 ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.309.05 కోట్లతో చేపట్టనున్న మరో 20 కొత్త ప్రాజెక్టుల పనులకు శంకుస్థాపన చేశారు. 75,151 మంది లబ్ధిదారులకు రూ. 167 కోట్ల సంక్షేమ పథకాలను పంపిణీ చేశారు. తామర భరణి, కరుమేనియారు, నంబియారు మిగుజలాలలను సద్వినియోగం చేసుకునే విధంగా ఈ మూడింటిని అనుసంధానించి వరద కాలువ ప్రాజెక్టును పూర్తి చేసి తిరునల్వేలి వాసులకు అంకితం ఇచ్చారు. అలాగే 11 పంచాయతీలలో పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు. లబ్ధిదారులకు గృహాలు, రైతులకు వ్యవసాయ పరికరాలు, దివ్యాంగులు, వెనుక బడిన సామాజిక వర్గ ప్రజలకు వివిధ సంక్షేమాలను సీఎం అందజేశారు. అసెంబ్లీ స్పీకర్ అప్పావు, మంత్రులు దురై మురుగన్, నెహ్రూ, కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్, కేఆర్ పెరియకరుప్పన్, గీతాజీవన్, అనిత ఆర్ రాధాకృష్ణన్, రాజకన్నప్పన్, పి. మూర్తి, ఎంపీలు సి.రాబర్ట్ బ్రూస్, ఎమ్మెల్యేలు ఎం.అబ్దుల్ వకాఫ్, రూబీ ఆర్. మనోహరన్, నైనార్ నాగేంద్రన్, తిరునల్వేలి జిల్లా కలెక్టర్ కార్తికేయన్ పాల్గొన్నారు.
అంతా మోసమే...
ఐదేళ్లలో మారనున్న రూపురేఖలు
సీఎం స్టాలిన్ మాట్లాడుతూ రానున్న ఐదేళ్ల కాలంలో దక్షిణ తమిళనాడులోని తెన్‌కాశి, తిరునల్వేలి, తూత్తుకుడి, విరుదునగర్ జిల్లాల ముఖ చిత్ర రూపురేఖలు మారబోతున్నాయని , ఇందు కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధమవుతోందన్నారు. మంత్రులు దురై మురుగన్, నెహ్రూ ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారని వివరించారు. నాంగునేరి, మరకలుకురిచ్చి, తిరువరామంగైపురం గ్రామాల్లో 2,291 ఎకరాల కొత్త పారిశ్రామి పార్కును ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. తిరునల్వేలి కార్పొరేషన్‌న్‌లో కొత్త మురుగునీరు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. పాళయం కోట్టై–అంబా సముద్రం రోడ్డు, మేళ పాళయం ప్రాంతంలో ఫోర్ వేలేన్ రోడ్డును ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. అంబా సముద్రం సర్కిల్ పాపనాశ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల కోసం మౌలిక సదుపాయాలను కల్పించనున్నామని, మహిళా మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదల కోసం తిరునల్వేలి జిల్లాలోని తీరప్రాంతాలలో సముద్ర ఆహారానికి విలువ మిళితంగా ఓ కేంద్రం ఏర్పాటు చేస్తామన్న కొత్త ప్రకటనలను సీఎం చేశారు.
2023లో భారీ వర్షానికి తిరునల్వేలి, తెన్‌కాశి, కన్యాకుమారి, తూత్తుకుడి జిల్లాలు ఏ మేరకు దెబ్బతిన్నాయో అందరికీ తెలుసునని గుర్తు చేస్తూ, ఈ సమయంలో కేంద్రం మంత్రులు ఒక్కరైనా వచ్చి ఓదార్చారా అని ప్రశ్నించారు. కనీసం నిధులైనా ఇచ్చారా అన్న ప్రశ్నలతో తన మాటలకు పక్కనే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రంకు కోపం రావచ్చు అని, అయితే, ఆయనకు నిజాలన్నీ తెలుసు , ఆయనకు మాట్లాడే అనుమతి అక్కడ ఉంటేగా..! అని చమత్కరించారు. వరద సాయం ఇవ్వక పోగా, బడ్జెట్‌లోనూ తమిళనాడుకు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదీ నిధి...ఏదీ న్యాయం. అంతా మోసం అంటూ కేంద్రం తీరును ఎండగట్టే విధంగా విమర్శలను ఎక్కుబెట్టారు. తిరునెల్వేలి హల్వా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని, అయితే, ఇప్పుడు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే హల్వా మరింత ప్రసిద్ధి చెందిందని విమర్శించారు. ప్రజల సంక్షేమం, ఆర్థిక ప్రగతి, యువత, మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యమని అన్నారు. రానున్న ఐదేళ్లలో దక్షిణాది జిల్లాల రూపురేఖలే మారబోతున్నాయని వివరించారు. తమిళనాడుకు డీఎంకే అండగా ఉందని, తమిళనాడు ప్రజలైన మీరు ఎల్లప్పుడూ డీఎంకేకు అండగా నిలుస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు.
న్యూస్‌రీల్
అంతా మోసమే!
అంతా మోసమే!
అంతా మోసమే!
Comments
Please login to add a commentAdd a comment