![నవ వరుడు అనుమానాస్పద మృతి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/08cni36-300094_mr-1739045036-0.jpg.webp?itok=l5FPb8Qy)
నవ వరుడు అనుమానాస్పద మృతి
తిరువళ్లూరు: పెళ్లయిన వారం రోజులకే నవవరుడు అనుమానస్పద రీతిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు..తిరువళ్లూరు జిల్లా పెనాలూరుపేట సమీపంలోని కాశీరెడ్డిపేటకు చెందిన ఉదయకుమార్(26) తాంబరంలో బ్యూటీషీయన్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయకుమార్‌కు తిరుపతి జిల్లా పిచ్చాటూరు పిళ్‌లైయార్‌వీధికి చెందిన పవిత్ర(25)తో పెద్దపాళ్యం భవానీ అమ్మవారి ఆలయంలో వివాహం జరిగింది. వివాహమైన తరువాత ఉదయకుమార్ పిచ్చాటూరులోని అత్తారింటికి వెళ్లినట్టు తెలుస్తుంది. అయితే శుక్రవారం ఉదయం అత్తారింటి నుంచి తన అప్పాచ్చి ద్విచక్ర వాహనంలో స్నేహితుల దగ్గరకు వెళ్తున్నట్టు చెప్పి తిరువళ్లూరుకు బయలుదేరాడు. మధ్యాహ్నం వరకు ఇంటికి రాకపోవడంతో పవిత్రతో పాటూ ఉదయకుమార్ బంధువులు ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరగా త్వరలోనే వచ్చేస్తానని చెప్పినట్లు తెలిసింది. అయితే రాత్రి 8 గంటల వరకు రాకపోవడంతో మళ్లీ బంధువులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెంది గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రాత్రి 9 గంటల సమయంలో ఉదయకుమార్ ఫోన్ నుంచి వ్యక్తి ఒకరు యువతి బంధువులకు ఫోన్ చేసి తచ్చూరు–చిత్తూరు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురై యువకుడు తీవ్ర గాయాలతో పడి వున్నట్టు సమాచారం అందించాడు. ఫోన్‌లో చార్జింగ్ లేకపోవడంతో తన కారులో చార్జింగ్ వేసి చివరిగా ఉదయకుమార్ మాట్లాడిన నంబర్‌లకు ఫోన్ చేస్తున్నట్టు తెలిపారు. గాయపడిన ఉధయకుమార్‌ను ఊత్తుకోట ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొస్తున్నానని అక్కడికి రావాలని కోరాడు. తర్వాత మెరుగైన చికిత్స తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తిరువళ్లూరు వైద్యశాలలో చికిత్స అందిస్తున్న క్రమంలో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు తిరువళ్లూరు వైద్యశాలకు చేరుకుని బోరున రోదించడం పలువురిని కలిచివేసింది. ఉదయకుమార్‌కు రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం లేదని ఎవరో హత్య చేసి పడేశారని ఆరోపిస్తూ రోదించారు. పెళ్లయి వారం రోజులు కూడా దాటకముందే నవ వరుడు అనుమానస్పద రీతిలో మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నింపింది.
పెళ్లయిన వారం రోజులకే ఘటన
తిరువళ్లూరు వైద్యశాల వద్ద రోదించిన బంధువులు
Comments
Please login to add a commentAdd a comment